ములుగురూరల్, డిసెంబర్ 29 : ములుగు జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచరిస్తున్నది. భూపాల పల్లి జిల్లా అడవి నుంచి ములుగు మండలం జాకారం వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా హనుమకొండ వైపు వెళ్తున్న 108 వాహన పైలట్ సాయిరెడ్డి దాన్ని చూసి వాహన వేగం తగ్గించాడు. లైట్ల వెలుతురులో పెద్దపులి ఒక్కసారి గా డివైడర్ మీదుగా దూకి ఫారెస్టు నర్సరీ నుంచి లోపలికి వెళ్లింది.
దీంతో సాయిరెడ్డి విషయాన్ని ఫారెస్టు అధికారులను తెలియజేయగా స్పందించిన ఎఫ్ఆర్వో డోలి శంకర్ సిబ్బందితో పెద్దపులి రోడ్డు దాటిన ప్రాంతాన్ని పరిశీలించి దాని అడుగులను గుర్తించారు. పెద్ద పులి నర్సరీలోకి వెళ్లి కంచె దాటే క్రమంలో పోల్ విరిగినట్లు గుర్తించారు. అప్రమత్తమైన ఫారెస్టు అధికారులు జాకారం, పందికుంట, మల్లంపల్లి, రామచంద్రాపురం, మదనపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎఫ్ఆర్వో వెంట బీట్ ఆఫీసర్లు, సిబ్బంది ఉన్నారు.
జాకారం వద్ద పాద ముద్రల ఆధారంగా మల్లంపల్లి మండలం పందికుంట అటవీ ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించినట్లు గుర్తించాం. పశువుల కాపర్లు, ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. రైతులు పొలాల వద్దకు వెళ్లే క్రమంగా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం పందికుంటతో పాటు మదనపల్లి, జగ్గన్నపేట, పత్తిపల్లి, పొట్లాపూర్, పంచోత్కులపల్లి, రాయినిగూడెం, సర్వాపురం, జగ్గన్నగూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో మొత్తం 20 ట్రాక్ కెమెరాలను అమర్చాం. పెద్దపులి కనిపిస్తే సమాచారం అందించాలి. పులికి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వెల్డ్ లైఫ్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.