వరంగల్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం అనేక మార్పులు తెచ్చింది. ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఊరూరా డంపింగ్‌యార్డు నిర్మించింది. పంచాయతీ సిబ్బందితో ఇంటింటా చెత్తను సేకరిస్తోంది. దీన్ని డంపింగ్‌యార్డుకు తరలించేందుకు పంచాయతీకో ట్రాక్టర్ లేదా ట్రాలీఆటోను సమకూర్చింది. సిబ్బంది ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లను నియమించింది. నిర్వహణ కోసం నెలనెలా ప్రతి గ్రామపంచాయతీకి నిధులు కేటాయిస్తోంది. దీంతో పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడింది. ఇళ్ల వద్ద, రహదారులపై, ఇతర ప్రదేశాల్లో ఎక్కడా చెత్త ఉండకుండా పంచాయతీ సిబ్బంది పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా పల్లెల్లో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. పల్లెప్రగతి కార్యక్రమం అమలుతో పల్లెలు పరిశుభ్రంగా ఉండడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో పల్లెప్రగతి కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తేవడం విశేషం. పల్లెప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని పారిశుధ్యం కోసం రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో నల్లబెల్లి మండల ప్రజలు పశుపక్ష్యాదుల అంతిమ సంస్కార వాటికలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, రహదారులపై చనిపోయిన పశువులు, జంతువులను పంచాయతీ సిబ్బంది సాయంతో ప్రభుత్వ స్థలాల్లో గోతులను తవ్వి పాతి పెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా పశుపక్ష్యాదుల అంతిమ సంస్కార వాటికలను ఏర్పాటు చేశారు. పల్లెల్లో వ్యాధులు ప్రబలకుండా దోహదపడుతున్నారు.
నల్లబెల్లి మండలం మీదుగా 365 జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిపై పలు సందర్భాల్లో వాహనాలు ఢీకొనడం వల్ల గేదెలు, ఆవులు, కుక్కలు, ఇతర పశువులు, జంతువులు చనిపోతున్నాయి. గ్రామాల్లో విద్యుత్ షాక్, ఇతర ప్రమాదాలతో కూడా పశువులు, జంతువులు మరణిస్తున్నాయి. వీటి కళేబరాలను స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది కొంత దూరం తీసుకెళ్లి కాల్వలు, బొందలు, ప్రభుత్వ స్థలాల్లో పడేస్తున్నప్పటికీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దుర్వాసనతోపాటు స్థానికంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సంవత్సరంన్నర క్రితం నల్లబెల్లి మండల కేంద్రంలో ఓ కోతి చనిపోయింది. స్థానికులు కొందరు కోతి కళేబరానికి అంత్యక్రియలు నిర్వహించారు. పల్లెప్రగతి పనుల పర్యవేక్షణలో భాగంగా పల్లెల్లో పర్యటిస్తున్న నల్లబెల్లి మండల పంచాయతీ అధికారి(ఎంపీవో) కూచన ప్రకాశ్ స్థానికులు వానరానికి అంత్యక్రియలు చేయడం చూశారు. ఈ క్రమంలో ఆయనకు గ్రామాల్లో వైకుంఠధామాల మాదిరిగా పశుపక్ష్యాదులకు అంతిమ సంస్కార వాటికలను అందుబాటులోకి తేవాలనే ఆలోచన వచ్చింది. మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో మాట్లాడి తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా పశుపక్ష్యాదుల అంతిమ సంస్కార వాటికలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నల్లబెల్లి, కొండాపూర్, మూడుచెక్కలపల్లి, రుద్రగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో వీటిని ఏడాదిన్నర నుంచి నిర్వహిస్తున్నారు.
మూడుచెక్కలపల్లెలో ఎకరం, కొండాపూర్‌లో 20 గుంటలు, రుద్రగూడెంలో 20 గుంటలు, నల్లబెల్లిలో 10 గుంటల ప్రభుత్వ స్థలంలో వీటిని ఏర్పాటు చేశారు. వీటి వద్ద పశుపక్ష్యాదుల సంస్కార బోర్డులను కూడా పెట్టారు. జాతీయ రహదారితో పాటు ఇతర రహదారులపై యాక్సిడెంట్లతో, గ్రామాల్లో వివిధ కారణాలతో చనిపోయిన పశువులు, జంతువుల కళేబరాలను పశుపక్ష్యాదుల అంతిమ సంస్కార వాటికలకు గ్రామ పంచాయతీ సిబ్బంది తరలించి జేసీబీతో గోతులను తీసి పాతిపెడుతున్నారు. తర్వాత ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లి పూలతో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్యం కోసం దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జేసీబీ కిరాయి చార్జీలను విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటికే ఈ అంతిమ సంస్కార వాటికల్లో 30కి పైగా బర్రెలు, ఆవులు, కుక్కలు, వానరాల కళేబరాలను పాతిపెట్టినట్లు నల్లబెల్లి ఎంపీవో కూచన ప్రకాశ్ చెప్పారు. ఇతర గ్రామాల్లో కూడా చనిపోయిన పశువులు, జంతువుల కళేబరాలను గ్రామ పంచాయతీ సిబ్బంది, దాతల సాయంతో ప్రభుత్వ, చెరువు శిఖం భూముల్లో గోతులు తీసి పాతిపెడుతున్నారు. ఒక గ్రామ ప్రజలను చూసి నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పశువులు, జంతువుల కళేబరాలను ప్రభుత్వ స్థలాల్లో పాతిపెట్టడాన్ని అమలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల స్థానికంగా తాము వ్యాధుల బారిన పడే అవకాశం ఉండదని ఈ మండల ప్రజలు చెబుతున్నారు.
ఊరూరా చైతన్యం
పల్లెప్రగతి కార్యక్రమం మాకు స్ఫూర్తినిచ్చింది. ప్రజల్లో చైతన్యం తెచ్చింది. నల్లబెల్లిలో స్థానికులు కొం దరు ఒకరోజు వానరానికి అంత్యక్రియలు చేయడం చూసి మండలంలోని అన్ని గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో మాట్లాడాను. ఊరూరా ఉన్న వైకుంఠధామం మాదిరిగా పశుపక్ష్యాదుల అంతిమ సంస్కార వాటి క నిర్వహిస్తామనే ప్రతిపాదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. మొదట ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న నల్లబెల్లి, కొండాపూర్, మూడుచెక్కలపల్లె, రుద్రగూడెం గ్రామాల్లో పశుపక్ష్యాదుల అంతిమ సంస్కార వాటికలను ఏర్పాటు చేశాం. చనిపోయిన బర్రెలు, ఆవులు, కుక్కలతో పాటు ఇతర పశువులు, జంతువులను ఈ సంస్కార వాటికల్లో స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది దాతల సహకారంతో గోతులు తీసి పాతిపెడుతున్నారు. మండలంలోని ఇతర గ్రామాల్లోనూ ప్రజలు ఇదే పనిచేస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పాతిపెడుతున్నారు. ప్రస్తుతం 29 గ్రామాల్లో ఇది అమలవుతోంది. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం లేదు.
– కూచన ప్రకాశ్, ఎంపీవో, నల్లబెల్లి