కాజీపేట: మార్చి 30 : కాజీపేట-హనుమకొండ- వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్‌గా అవతరిస్తుందని ఆశ పడుతున్నారు. తెలంగాణలో మరో రైల్వే డివిజన్ ఏర్పడితే ఉద్యోగాల సంఖ్య పెరిగి మరి కొంతమంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ నుండి కొన్ని కొత్త రైళ్లను ప్రారంభించడానికి అవకాశం కూడా లభిస్తుందని ఆశలు పెంచుకున్నారు. నూతనంగా రైల్వే మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ యూనిట్ రావడంతో అందరిలో కాజీపేట డివిజన్ ఆశలు మళ్లీ ఒక ఉన్నత స్థాయిలో చిగురించాయి.
కానీ, ఏ రోజు కైనా కాజీపేటను డివిజన్ కాకుండా చేస్తామని సీమాంధ్ర అధికారులు పన్నాగం పన్నినట్టు ఉన్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా కాజీపేటలోని రైల్వే కార్మికుల సంఖ్యను క్రమ క్రమేనా తగ్గిస్తూ వస్తున్నారు. ఇందులో ప్రతిసారి మొదటి వేటు లోకో పైలట్ విభాగం పైనే పడుతున్నది. ఇటీవల కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో కాజీపేట లోని కోచింగ్ లింకులను విజయవాడకు తరలించిన సందర్భంలో అప్పటి బీఆర్ఎస్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో లోకో పైలట్ లందరూ ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. దీనికి కాజీపేలోని స్థానిక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు తెలపడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి కోల్పోయిన కోచింగ్ లింకులను తిరిగి ఇవ్వడంతో పాటు, వాడి బీదర్ సెక్షన్లో నడిచే కొన్ని ట్రైన్లను కాజీపేటకు కేటాయించి చర్యలు చేపట్టారు. కానీ కొంతకాలానికి వాటిని కూడా తిరిగి వేరే డిపోలకు కేటాయించడంతో కాజీపేట క్రూ డిపో ఎంతో నష్టపోయింది.
ఒక రకంగా చెప్పాలంటే కాజీపేట క్రూ డిపోను నిర్వీర్యం చేయడానికి బీజం ఇక్కడే పడిందని చెప్పవచ్చు. గత ఐదు సంవత్సరాల కాలంగా కాజీపేట క్రూ డిపోలో పనిచేస్తున్న లోకో పైలట్ల సంఖ్యను అధికార గణం క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నది ఈ విషయం కార్మిక సంఘాలు గుర్తించకుండా కొద్దికొద్దిగా తగ్గిస్తూ వచ్చింది. గత ఐదు సంవత్సరంలో నుండి ట్రాన్స్ఫర్ ల రూపంలో, నూతన పోస్టింగులు కాజీపేట కు 10 మందికి మించి కేటాయించ లేదు, కానీ ఇక్కడి నుండి చాలామంది ప్రమోషన్ల రూపంలో వేరువేరు క్రూ డిపోలకు వెళ్లారు.
2020 వ సంవత్సరంలో 623 మందితో నడిచిన క్రూ డిపో నవంబర్ 2023 నాటికి 501 , మార్చి 2025 కు 470 కి పడిపోయింది. ఈ విధంగా రోజురోజుకు సంఖ్యను తగ్గిస్తూ రైల్వే అధికారులు కాజీపేట పై ఉన్న నిరాసక్తను తెలియజేస్తున్నారు. కాజీపేట క్రూ డిపోకు మే 2020లో కేటాయించిన పోస్టుల సంఖ్య 790 కాగా ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ సంఖ్య 542 కు పడిపోయింది. అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో 248 పోస్టులు ఇక్కడి నుండి తొలగించబడ్డాయి.
గూడ్స్ లోకో పైలట్ల నుండి సీనియార్టీ ప్రకారం పదోన్నతి కల్పిస్తూ ప్యాసింజర్ లోకో పైలట్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ విధంగా పదోన్నతుల కల్పనలో కూడా కాజీపేటలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా, విజయవాడ డివిజన్లో ఉన్న సికింద్రాబాద్ కు చెందిన క్రూ డిపోలో భర్తీ చేశారు. ఈ విధంగా చేయడం వలన ఆయా సంబంధిత ఖాళీలలో కాజీపేట కు చెందిన గూడ్స్ లోకో పైలట్లు సుమారు 30 మంది పని చేస్తున్నారు.
కొంతమంది పదవీ విరమణ పొందడం, కోవిడ్ కష్టకాలంలో మరణించడం, కొంతమంది లోకో ఇన్స్పెక్టర్, ప్యాసింజర్ లోకో పైలట్లుగా పదోన్నతి పొందడం, మరి కొంత మంది మెడికల్ అన్‌ఫిట్ అవడం వలన కాజీపేటలోని గూడ్స్ లోకో పైలట్ల సంఖ్య గణనీయంగా పడపోయింది. దీనికి తోడు అధికారులు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లను పరిగణలోకి తీసుకోక పోవడంతో కాజీపేట డిపో క్రూ సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది.
అయితే విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో విజయవాడ డివిజన్ అనేది విశాఖపట్నం జోన్ లోకి వెళ్తున్నదని రైల్వే అధికారులు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో కాజీపేట లోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గించి వారిని విజయవాడ డివిజన్లో సికింద్రాబాద్‌కు చెందిన లోకో పైలట్లుగా పని చేస్తున్న డిపోలో కలపడం ఒక హాస్యాస్పదంగా మారింది. ఈ విధంగా కలపడం వలన భవిష్యత్తులో సికింద్రాబాద్ డివిజన్లోని లోకో పైలట్ల ఉద్యోగాల సంఖ్య తగ్గిపోనున్నది.
సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు తనానికి ఆంధ్ర నాయకులు వారి వారి స్థాయిలలో కృషిచేసి రైల్వేల పరంగాను ఎదగకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్ర ప్రాంతంకు చెందిన కొంతమంది అధికారులు సికింద్రాబాద్ డివిజన్లో పనిచేస్తూ ఇంకా ఆంధ్రకే మద్దతునిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట డివిజన్ ఏర్పాటును అడ్డు కుంటున్నట్టుగా తెలియ వస్తున్నది. కాజీపేట డివిజన్ ఏర్పాటులో కీలక భూమిక పోషించ నున్న లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడ లను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలోని రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ – హనుమకొండ – కాజీపేట కు కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌ను కేటాయించడం, ఇదే సందర్భంలో రైల్వే ఫ్యాక్టరీ కాస్త మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మారడంతో ఇక్కడి ప్రజలలో రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. కానీ అధికారుల ఈ విధమైన చర్యలతో డివిజన్ గా మారే ఆశలు సన్నగిల్లు తున్నాయి. ఇక్కడి రైల్వే కార్మికులు, కార్మిక నాయకులు, ప్రజలు అందరూ అధికారుల చర్యలను విమర్శిస్తూ కాజీపేట డివిజన్ గా ప్రకటించాలని కోరుతున్నారు.