హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పెద్దఎత్తున్న బైక్ ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో లక్షలాది ఉద్యోగుల భద్రతను, కుటుంబాల సంక్షేమాన్ని బలి తీసుకున్న స్కీమ్ సీపీఎస్ అని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించకుండా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేవిధంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని ఉద్యోగులు 20 ఏండ్లుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినవిధంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట నాయకులు, జేఏసీ నేత అన్నమనేని జగన్మోహన్రావు మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని రాష్ర్టంలో పెద్దసంఖ్యలో సీపీఎస్ ఉద్యోగుల సంక్షేమం, భద్రత కోసం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డబ్బులను స్టాక్ మార్కెట్లో పెట్టీ పెన్షన్ ఇవ్వడం అనేది ఉద్యోగుల వృద్ధాప్య జీవితాన్నిపణంగా పెట్టడమేనని అన్నారు. వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్ గజ్జెల రాంకిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని, సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు.
టీఎస్ యుటిఎఫ్ పక్షాన పెండెం రాజు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని వేచి చూశామని ఇకముందు వేచిచూడటం జరగదని సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం చేస్తూ కార్యాచరణను ముందుకెళ్తామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, పెన్షనర్ల సంఘాల నేతలు, నాలుగవ తరగతి ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల జేఏసీ నేతలు బైరీ సోమయ్య, పెండెం రాజు, గణిపాక రాజ్‌కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, గాజే వేణుగోపాల్, ఫణికుమార్, పుల్లూరు వేణుగోపాల్, సదానందం, పనికెల రాజేష్, కిరణ్‌గౌడ్, రఘుపతిరెడ్డి, సదానందం, రాజేష్‌కుమార్, హేమనాయక్, నరేందర్‌నాయక్, జగన్మోహన్రెడ్డి, భిక్షపతి, కృష్ణమూర్తి, గోపాల్‌రెడ్డి, సర్వర్ హుస్సేన్, సీతారాం, కత్తి రమేష్, శ్యామ్‌సుందర్, సాంబయ్య, రాజు, రాజేష్ ఖన్నా, మాధవరెడ్డి, ఖన్నా, రాజమౌళి, సురేష్, భారత్, శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, మాధవరెడ్డి, పావని, శ్రీలత, రాజీవ్, అనూప్, ప్రణయ్, పృథ్వీ పాల్గొన్నారు.