వనపర్తి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : అదును దాటుతున్నా వరుణదేవుడి జాడ కనిపించడం లేదు. సాధారణం తప్పా పదును వానలు కురవడం లేదు. ఇప్పటికే మెట్ట పైర్లను పూర్తిస్థాయిలో సాగు చేయాల్సిన రైతులు 5 శాతం కూడా విత్తలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైబడి రైతులు ఆకాశం వైపు ఎదురు చూడటం తప్పా మరోటి లేదు. అప్పుడప్పుడు చినుకులు రాలడం వరకే ఈ వానకాలం సీజన్ పరిమితమైంది. ఏ మండలంలో చూసినా లోటు వర్షపాతంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితిలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వరుణుడి కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను రైతులు చేస్తున్నారు.
వానకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా రైతన్న మొఖంలో కాసింత నగుమోము కూడా కనిపించడం లేదు. తెచ్చుకున్న విత్తనాలు ఇంట్లోనే ఉండడంతో చేసేది లేక ఆకాశం వైపు చూస్తున్నాడు. వానకాలం వెళ్లిపోతోందని దిగాలు పడుతున్నారు. వరి సాగుబడుల సంగతటుంచితే కనీసం మెట్ట పైర్లకైనా తగినంత వర్షం కురవడం లేదు. మొదట్లో అడ పా.. దడపా పడిన వానలకు కొద్దిమేర మెట్టపైర్లు రై తులు సాగు చేశారు. 15 రోజుల నుంచి పగలు, రా త్రి తేడా లేకుండా ఆకాశం మేఘాలతో ఊరిస్తున్నప్పటికీ చిరుజల్లుల వరకు పరిమితమవుతున్నాయి. పూర్తిస్థాయిలో విత్తనాలు వేసేందుకు సమృద్ధిగా వ ర్షాలు కురవడటమే కరువైంది. వనపర్తి జిల్లా వ్యా ప్తంగా మొత్తం 3.50 లక్షల ఎకరాల్లో వివిధ పంట లు సాగు చేస్తున్నట్లు అధికారుల అంచనా. కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే తప్పా ఆరుతడి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉండదు. సమయం మించి పోతున్నా వర్షాల జాడ మాత్రం కానరావడం లేదు.
జిల్లాలో మెట్టపైర్ల సాగు సైతం అత్యంత దయనీయంగా ఉన్నది. పూర్తిస్థాయిలో ముగించాల్సిన క్ర మంలో అసలు మొదలే కాలేదన్నట్లుగా కనిపిస్తుం ది. కొన్ని చోట్ల మాత్రమే ఒకటి, రెండు సాధారణ వర్షాలు కురిశాయి. ఈ తొలి చినుకులకే కొందరు రైతులు మెట్ట పైర్లను సాగు చేశారు. మరో వాన కోసం ఎదురు చూసిన అన్నదాతలకు ఇప్పటి వరకు అడ్రస్ లేకుండా పోయాయి. వరి సాగును పక్కన పెడితే.. లక్షా 20 వేల ఎకరాల్లో మెట్ట పంటలను సా గు చేస్తారన్న లెక్క ఉన్నది. ఇప్పటి వరకు కేవలం 5 శాతం మాత్రం కూడా సాగుకు నోచుకోలేదు. అలాగే వరి సాగు 2 లక్షల ఎకరాల్లో అంచనా ఉన్న ది. ఇక మక్క, పత్తి, జొన్న, కందులు, ఇతర పంట లు కలిపి ఇప్పటి వరకు కేవలం 15వేల ఎకరాల్లోపే సాగయ్యాయి.
జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉంటే 11 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరో 4 మం డలాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. రేవల్లి, వీపనగండ్ల మండలాల్లో ఎక్సెస్ నమోదైతే, ఏదుల, చిన్నంబాయి మండలాల్లో సగటు వర్షపాతం నమోదైంది. ఇక గోపాల్పేట, పెద్దమందడి, శ్రీరంగాపురం, పాన్‌గల్, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి, మదనాపురం, అమరచింత, ఆత్మకూరు, ఏదుల మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అప్పుడప్పుడు పడ్డ చినుకులకు కొందరు రైతులు మెట్ట విత్తనాలు వేసుకోగా మొలవక అవస్థలు పడుతున్నారు. కొంద రు సాగునీరు అందుబాటులో ఉన్న వారు తడిని పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15 రకాలకుపైగా పంటలు సాగు చేస్తుండగా ఇందులో సింహభాగం వరితోపాటు పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న, మినుములు పంటలే ఉన్నాయి.
రైతులు పరిస్థితులకు అనుగుణంగా ముందుకు రావాలి. వర్షాలు గ్యారంటీ లేనుందునా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి. వ్యవసాయ శాఖ సూచనల మేరకు పైర్లు సాగు చేయాలి. వారం రోజులు వానల్లేకుంటే పీఆర్జీ 176 రకం కందిని వేయాలి. 130 రోజుల్లో చేతికి వచ్చే ఈ రకం విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నాం. ఆగస్టు 15 వరకు వర్షాకాల సీజన్‌ను మార్పులు అనివార్యంగా ఉంటాయి. ఇప్పటి వరకు జిల్లాలో మెట్ట సాగు కేవలం 5 శాతం వరకు మాత్రమే ఉన్నది.
– ఆంజనేయులు, వనపర్తి డీఏవో
45 రోజులుగా వర్షం జాడ లేదు. వానకాలం గడువు ముందుకు వెళుతున్నా ఇంత గొట్టుగా ఎప్పుడూ లేదు. మూడు ఎకరాల్లో మక్కలు వేయాలని సిద్ధం చేసుకున్నా.. ఇప్పటి వరకు భారీ వర్షం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఎలా బతకాలో అర్థం కావడం లేదు. మక్కల సీజన్ వెనక్కి అయింది. ఇప్పుడు వర్షం వచ్చినా విత్తడం కష్టమే. తెచ్చిపెట్టుకున్న విత్తనాలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ సీజన్ అంతా గందరగోళంగా ఉండడంతో రైతులు దిగులు పడ్తుండ్రు.
– ఎం.రమేశ్, రైతు, దొడగుంటపల్లి, పెద్దమందడి మండలం
ఇప్పటి వరకు ఒక్క వర్షం కూడా పదును పాటు రాలేదు. ఇప్పుడు వచ్చినా కూడా కష్టమే. 5 ఎకరాల్లో ప్రతి ఏటా మక్కలు వేసుకున్నాం. ఇప్పుడు ఒక్క గింజ కూడా వేయలేదు. కొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేసుకునే వాళ్లం. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. భూమి పొతం చేసి పెట్టుకున్నా ఉపయోగం లేదు. వానలు వచ్చే
పరిస్థితి కూడా కనిపించడం లేదు.
– రవి నాయక్,రైతు, కొత్తకుంటతండా, పెద్దమందడి మండలం