చిక్కడపల్లి, జూలై 24: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ‘గీతన్న చైతన్య యాత్ర’ కార్యక్రమ వాల్‌పోస్టర్లను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన భవన్లో శుక్రవారం శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత వృత్తిలో ప్రమాదాలకు గురైన వారికి ప్రభుత్వ నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ ఆగస్టు 2న మానుకొండ నుంచి 18 వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశ్వర్లు గౌడ్, గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ బీ బాలరాజ్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.