సుబేదారి/నర్సింహులపేట, జూన్ 7 : వర్షాకాలం సమీపిస్తున్నది.. అదునుకు వానలు పడుతుండడంతో విత్తనం వేసేందుకు రైతులు దుక్కులు, వరినారు పోసేందుకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా పంటల సాగు, విత్తన ఎంపిక విషయంలో రైతులకు వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు, సలహాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో అన్నదాతలు అదనుకు దొరికే నకిలీ బీటీ విత్తనాలు, నాణ్యతలేని సీడ్‌ను వాడి మోసపోతున్నారు. పంట వేశాక పూతాకాత లేక రైతులు నష్టపోతున్నారు. పొరుగు రాష్ర్టాల నుంచి యథేచ్ఛగా నకిలీ విత్తనాలు వస్తున్నా పట్టించుకునే వారు లేరు.
కొందరు కేటుగాళ్లు కలుపు మందు వాడినా పత్తి మొక్క చనిపోదని బీటీ-3 పేరుతో గ్రామాలు, తండాల్లో రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. వివిధ కంపెనీల విత్తనం కంటే తమ విత్తనమే నాణ్యమైనదని, తక్కువ రేటుకు ఇస్తామని రైతులను నమ్మించి మోసం చేస్తున్నారు. ఏటా అధికారులు నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపుతున్నా ఈ దందాకు మాత్రం చెక్ పడడంలేదు.
నకిలీలపై ఉక్కుపాదం మోపి నిందితులపై పీడీయాక్టులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యహరించడంతో పాత నేరస్తులు మళ్లీ రెచ్చిపోతున్నారు. సీజన్ మొదలుకాగానే అమాయక రైతులను లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగా దందా చేస్తున్నారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ సహా పలుచోట్ల తరచూ నకిలీ విత్తనాలు, పురుగుల మందు విక్రయ ముఠాలు పట్టుబడుతున్న విషయం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా మంత్రి.. నకిలీల అంశాన్ని ప్రస్తావించారు. నిందితులపై ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారు? పీడీయాక్ట్ ఎందుకు పెట్టడం లేదు? అని ప్రశ్నించారు. రైతులను మోసం చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సమావేశానికి హాజరైన పోలీసు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అయితే మంత్రి చెప్పిన కొద్దిరోజులకే శుక్రవారం రెండు ముఠాలను కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు ముఠాల్లో కూడా పాత కేసుల్లోని నిందితులున్నారు. తరచూ పట్టుబడే ఇలాంటి ముఠాల పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నిందితులు కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించి, బయటి వచ్చి మళ్లీ రైతులను మోసం చేస్తున్నట్లు తెలుస్తున్నది. స్వయంగా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశించినా పీడీయాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు కాకపోవడంతో నకిలీలు రెచ్చిపోతున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఈ సీజన్లో బ్రాం డెడ్ కంపెనీల పేర్లతో రైతులను నమ్మించి మోసం చేసేందుకు మరికొన్ని నకిలీ ముఠాలు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా నకిలీలపై ఉక్కుపాదం మోపాలని రైతులు కోరుతున్నారు.
యాసంగి సీజన్లో మార్చి 22న వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా రూ.78 లక్షల 63వేలు విలువైన నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయాలకు పాల్పడిన ఏడుగురి ముఠాను పట్టుకున్నారు. వాటి తయారీకి ఉపయోగించిన మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో వరంగల్, పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారు. అలాగే వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో మరో రెండు ముఠాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పరకాల, గీసుగొండ పోలీసులు శుక్రవారం సంయుక్తంగా పట్టుకొని రూ.63 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు, పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ దందా వ్యవహారాల్లో మార్చి నెలలో పట్టుబడిన నిందితులు, రెండు రోజుల క్రితం హనుమకొండలోని సీపీ కార్యాలయంలో సీపీ అరెస్ట్ చూపిన నిందితుల్లో కూడా కొందరు పాత నేరస్తులు ఉన్నారు.
అధిక దిగుబడి, చీడ పీడలు తట్టుకునే రకం అనే సమ్మకంతో రైతులు బీటీ-3 పత్తి వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే కాకుండా కలుపునివారణ లేకుండా దిగుబడి వచ్చే అవకాశం ఉందని మొగ్గుచూపుతున్నారు. ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించడంతో డిమాండ్ పెరిగింది. కొంతమంది వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతూ తమకు పరిచయం ఉన్న రైతులను కలుస్తూ, వారి ద్వారా ఈ విత్తనాలు రైతులకు అంటగడుతున్నారు. బీటీ విత్తనం రూ.వెయ్యి నుంచి రూ.1200ల వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతుల వద్దకు బీటీ -3 విత్తనాలు చేరినట్లు తెలుస్తున్నది.
అయితే, ఇప్పటికే రైతులు దుక్కులు సిద్ధం చేసుకొని.. అచ్చు తోలి చేన్లను సిద్ధం చేసుకున్నా, అధికారులు మాత్రం నకిలీ విత్తనాలపై రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. అధికారులు మాత్రం లైసెన్స్ ఉన్న విత్తన షాపుల్లో మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు తప్పా.. గ్రామాల్లో పత్తి విత్తనాలు అమ్మే వారిపై కన్నెత్తి కూడా చూడకపోవడంతో అక్రమ వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఏవో వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో బీటీ -3 విత్తనాలు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. నకిలీ విత్తనం అమ్మేవారి సమాచారం పోలీసులకు కానీ, ఏఈవోలకు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.