ఐనవోలు( హనుమకొండ): ఐనవోలు మండలం వెంకటాపురంలో సీలింగ్ భూముల అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కోరారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విక్రమ్ కుమార్ను కలిసి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదునూరి వెంకట్రాజం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి మాట్లాడుతూ.. వెంకటాపురంలోని సర్వే నెంబర్ 324/C లోని 158 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ సీలింగ్ భూములను కొంతమంది రాజకీయ, ఆర్థిక పలుకుబడి కలిగిన వ్యక్తులు రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించుకొని రెవెన్యూ రికార్డులో చొరబడ్డారు.
ఈ భూముల అక్రమణ పై గత 15 ఏళ్లుగా భూమిలేని నిరుపేదలు అనేక విధాలుగా పోరాటాలు చేస్తుంటే రెవెన్యూ అధికారుల మాత్రం గతంలో ఏ రికార్డులో లేనటువంటి అక్రమణదారులకు సహకరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. ఈ సీలింగ్ భూముల పై లోతైన విచారణ జరిపించాలని, ఈ సందర్భంగా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ భూముల పై విచారణ చేపట్టి అక్రమార్కుల పట్టాలను రద్దు చేసి వారి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల వచ్చే శాసనసభ సమావేశంలో సీపీఐ శాసనసభ నాయకుడు కూనంనేని సాంబశివరావు ద్వారా అసెంబ్లీలో చర్చ చేయించి రాష్ట్రస్థాయిలో ఈ అంశం చర్చ జరిగేలా చేస్తామని ఈ మేరకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, రాజు తదితరులు ఉన్నారు.