సూర్యాపేట, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో నీటి చుక్కకు ఎరుగని ప్రాంతం గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సస్యశ్యామలం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేండ్లలో తిరిగి రైతులకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. చిన్నపాటి సాకును చూపించి కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి తమ నోట్లో మట్టికొడుతుందని.. వరుసగా మూడోసారి పంటలను ఎండబెడుతున్నదని రైతులు కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఎస్సారెస్పీ ఫేజ్-2 కింద సుమారు 2.21 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా నేరుగా చెరువులు, కుంట లు నింపడం ద్వారా మరో 45 వేలు మొత్తం 2.66 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం. 2004 నాటికే ప్రాజెక్టు లేకుండా నికర జలాల లెక్క తేలకుండానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఎస్సారెస్పీ కాలువలు తవ్వగా 2018 వరకు ఒక్క చుక్క నీరు రాలేదు.
పోరాడి సాధించిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇంచు భూమి వదలకుండా సస్యశ్యామలం కావాలని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో 2018లో జిల్లాకు తొలిసారి నీళ్లు చేరాయి. అంతకుమునుపు యాసంగిలో 2.66 లక్షల ఆయకట్టుకు గాను 50వేల ఎకరాలకు మించి వరి పండించలేదని వ్యవసాయశాఖ లెక్కలే చెప్తుండగా కాళేశ్వరం పూర్తయిన తరువాత 2023 వరకు యాసంగిలో వందశాతం వరి పంట పండుతూ వచ్చింది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నాగా రం, మద్దిరాల, నూతనకల్ ఆరు మండలాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, సూర్యాపేట, పెన్‌పహాడ్ నాలుగు మండలాలు, కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె, నడిగూడెం, మునగాల మూడు మండలాలు మొత్తం జిల్లాలోని 13 మండలాలకు కాళేశ్వరం నీళ్లు వచ్చాయి.
అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న సాకును చూపి కాళేశ్వరాన్ని పండబెట్టడంతో 2024 యాసంగిలోనే జిల్లాలో దాదా పు 75 వేలకుపైనే ఎకరాల్లో వరి పంట ఎండ టం… ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పంటలను పరిశీలించివెళ్లిన విషయం తెల్సిందే. తదనంతరం 2025 యాసంగిలో లక్ష ఎకరాల వరకు ఎండింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వచ్చిన మూడో యాసంగిలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వరి ఎండుతుంది.
జిల్లాలో ఎండిన వరిని గాలికి వదిలేసి ఇప్పుడిప్పుడే ఎండిపోతూ కాస్త పచ్చగా ఉన్న వరి పొలాలను రైతులు ఎకరా ఒక్కంటికి రూ.వెయ్యి నుంచి రూ.1,500కు గొర్లు, పశువుల మేతకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 40 రోజుల క్రితం నాట్లు వేసిన పొలాలు దాదాపు 10 వేల ఎకరాల్లో ఎండిపోయినట్టు తెలుస్తున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టులో మరో లక్షకు పైనే ఎకరాల్లో ఎండిపోయి తీవ్ర నష్టం చేకూరే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులుమాని కాళేశ్వరం పంపులను ఆన్‌చేసి పంటలను కాపాడాలని, లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీళ్లివ్వక నేను వేసిన వరి ఎండిపోతూనే ఉన్నది. ఈ సారి కూడా ఐదెకరాలు వేస్తే మొత్తానికి మొత్తం ఎండిపోయింది. పంటలు వేసే సమయంలోనైనా నీళ్లివ్వలేమని చెబితే మరేదైనా పంట వేసేటోళ్లం. ఏదీ చెప్పకుండా ఉంటే కేసీఆర్ ఇచ్చినట్టే నీళ్లిస్తారనే ఆశతో వరి వేస్తున్నం. కానీ నీళ్లు రావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను కరుణించి నీళ్లిచ్చి ఆదుకోవాలి.
– అబ్బగాని లింగయ్య, ఆత్మకూర్.ఎస్