(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎల్పీజీ సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఖాళీ సిలిండర్లతో మండుటెండలో గంటల తరబడి వేచిచూసే వారి సంఖ్య వందల్లోకి చేరింది. దేశమంతటా ఇదే పరిస్థితి తలెత్తుతున్నది. అయితే, క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం చేస్తున్న ప్రకటనలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 99 ఫారిన్ ట్రిప్స్తో మొత్తంగా 79 దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ.. గ్యాస్ సమస్యను పరిష్కరించలేకపోవడంపై పలువురు విరుచుకుపడుతున్నారు. మోదీ దౌత్యంలో విఫలమయ్యారంటూ.. పలు కారణాలను చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చ వైరల్‌గా మారింది.
వెళ్లడం.. రావడం.. అంతేనా?!
ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గడిచిన 12 ఏండ్లలో 99 విదేశీ పర్యటనలు చేసిన మోదీ మొత్తంగా 79 దేశాలను చుట్టి వచ్చారు. మోదీ పర్యటించిన దేశాల్లో చమురు నిల్వలకు కేరాఫ్‌గా నిలిచే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, ఒమన్, బహ్రెయిన్, నైజీరియా, ఘనా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. ఇక ఎల్పీజీ, సీఎన్జీకి హబ్‌గా పిలిచే ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, అర్జెంటీనాలోనూ మోదీ పర్యటించారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా గల్ఫ్ దేశాలను పక్కనబెడితే, యుద్ధానికి దూరంగా ఉన్న అర్జెంటీనా, నైజీరియా, ఘనా, బ్రెజిల్ నుంచి భారత్ గ్యాస్, చమురును దిగుమతి చేసుకోవచ్చు. అయితే, ఈ దిశగా మోదీ సర్కారు చర్యలు చేపట్టడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. దేశంలో గ్యాస్ కొరత పెచ్చరిల్లినప్పటికీ, కేంద్రం ప్రకటనలకే పరిమితమయినట్టు చెప్తున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఫొటోలు దిగడం.. తిరిగి రావడం తప్ప.. మోదీకి దౌత్య విజయాలేమీ లేవని ఎద్దేవా చేస్తున్నారు.