హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లోని చారిత్రక సికు చావ్నీ భూముల వివాదానికి హైకోర్టు తెరదించడంపై ఆల్ తెలంగాణ గురుద్వారాస్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పుపై కమిటీ చైర్మన్ గురుచరణ్ సింగ్ బగ్గా మాట్లాడుతూ.. అత్తాపూర్లోని మహారాజా రంజీత్ సింగ్ నగర్లో 1832 నుంచి సికు సమాజం నివసిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఆదాయ వసూళ్ల కోసం సికు దళాలను పంపాలని హైదరాబాద్ నిజాం కోరడంతో పంజాబ్ పాలకుడైన మహారాజా రంజిత్ సింగ్ 14 సికు మిసల్ (బెటాలియన్)లను పంపి, రాంబాగ్, మీర్ ఆలం ట్యాంక్ మధ్య ప్రాంతంలో మోహరించారని, 1950లో సికు దళాలను రద్దు చేసినప్పటికీ వారి వారసులు అక్కడే నివసిస్తున్నారని, దీంతో ఆ ప్రాంతాన్ని సికు చావ్నీ అని పిలుస్తున్నారని గుర్తుచేశారు. ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని సికు సమాజం ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నదని, ఈ క్రమంలో గురుద్వారా కమిటీ వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి అనుకూలంగా తీర్పు ను వెలువరించిందని పేర్కొంటూ.. ఇప్పటికైనా సిక్కు చావ్నీ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు తీర్పుపై గురుద్వారా సాహెబ్ బారాంబాలా చైర్మన్ హర్బన్స్ సింగ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.