హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. పోర్టల్ ప్రారంభమై ఆరు రోజులు దాటినా సాంకేతిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇంటి పెద్ద పేరు, కుటుంబసభ్యుల వివరాలు నమోదవుతున్నాయి. కానీ, చిరునామాలో తప్పులు రికార్డవుతున్నాయి. ముఖ్యంగా ఒక మండలానికి బదులు మరో మండలం పేరు కనిపిస్తున్నదని దరఖాస్తుదారులు చెప్తున్నారు. తరుచూ సర్వర్ మొరాయిస్తుండటంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వెంటనే సాంకేతిక సమస్యలను సరిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నారు.
ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను ‘మీ-సేవ’ కేంద్రాల ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం జీవో- 172ను జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఫ్యామిలీ రిజిస్టర్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆధార్ నంబర్ నమోదు చేసిన వెంటనే రేషన్‌కార్డులోని కుటుంబ సభ్యుల వివరాలు పోర్టల్‌లో కనిపిస్తున్నాయి. అయితే, దరఖాస్తుదారుడి పేరు, జిల్లా పేరు యథాతథంగా నమోదవుతున్నాయి. కానీ, వేరే జిల్లాలకు సంబంధించిన మండలాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో దరఖాస్తుదారులు ఆయోమయానికి గురవుతున్నారు. ఈఎస్డీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిస్సహాయతను వ్యక్తంచేస్తున్నారని వాపోతున్నారు.
ఫ్యామిలీ రిజిస్టర్ పోర్టల్‌లో ఆధార్‌కార్డు నంబర్ నమోదు చేసిన వెంటనే రేషన్‌కార్డులోని వివరాలు కనిపిస్తున్నాయి. అయితే, కుటుంబసభ్యుల్లో ఎవరైనా మరణించినా, జన్మించినా, కొత్తగా పెండ్లి చేసుకున్నా, చిరునామా మారినా.. తదితర వివరాల నమోదుకు అవకాశం ఉండటం లేదని దరఖాస్తుదారులు చెప్తున్నారు. దీంతో పాత వివరాలే ఫ్యామిలీ రిజిస్టర్లో రికార్డవుతున్నాయని వాపోతున్నారు. తహసీల్దార్లను అడిగితే తమకేమీ తెలియదని అంటున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్టర్ పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళనకు గురవుతున్నారు.
ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ పొందడానికి ఆగస్టు 31 వరకే గడువు ఉన్నదని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు పనులన్నీ పక్కనబెట్టి ‘మీ-సేవ’ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే, వాస్తవానికి ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం నిర్ధిష్టమైన గడువు విధించలేదని ఈఎండీ అధికారులు స్పష్టంచేశారు. అసత్య ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. అలాగే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్పులు, చేర్పుల కోసం అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.