కొలంబో: కేరళకు చెందిన వ్యక్తి శ్రీలంకలో అరెస్టయ్యాడు. జైలులో జరిగిన అల్లర్లతో అతడితోపాటు పలువురు మరణించారు. అయితే ఆ దేశ పోలీసుల రక్షణ మధ్య ఆ వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేసినట్లు దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు. భారత రాయబార కార్యాలయం అధికారులు ఈ అంత్యక్రియలలో పాల్గొన్నట్లు చెప్పారు. (Kerala Man Killed In Sri Lanka) కేరళకు చెందిన 73 ఏళ్ల ఉన్నికృష్ణన్ ఎస్, గత నాలుగు దశాబ్దాలుగా తన కుటుంబంతో కలిసి తమిళనాడు రాజధాని చెన్నైలో నివసిస్తున్నాడు. మార్చి 2న ఆయన శ్రీలంక వెళ్లగా గంజాయి కలిగి ఉన్న ఆరోపణలతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నెగోంబో జైలుకు తరలించారు.
కాగా, జూలై 5, 6 తేదీలలో శ్రీలంకలోని ఆ జైలులో ఉన్న ఖైదీల మధ్య తీవ్రస్థాయిలో అల్లర్లు జరిగాయి. మాదకద్రవ్యాల విషయంలో ఖైదీల ప్రత్యర్థి వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఉన్నికృష్ణన్‌తో సహా 22 మంది ఖైదీలు, 10 మంది జైలు అధికారులు మరణించారు. మరో వంద మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై సీఐడీ విచారణ జరుపుతున్నది.
మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు జైలు అల్లర్లలో మరణించిన భారతీయ ఖైదీ ఉన్నికృష్ణన్ మృతదేహానికి అంత్యక్రియలను సెప్టెంబర్ 2న పోలీసుల రక్షణ మధ్య ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించినట్లు సీఐడీ అధికారులు నెగోంబో మేజిస్ట్రేట్ కోర్టుకు మంగళవారం తెలియజేశారు. కొలంబోలోని భారత హైకమిషన్ అధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు చెప్పారు. మృతుడు మరణించిన సమయంలో ధరించిన దుస్తులు, చెప్పులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం కోర్టుకు అప్పగించినట్లు వివరించారు.
అయితే ఆ జైలులో అల్లర్లకు సంబంధించిన ఐదుగురు అనుమానితుల కోసం గుర్తింపు పరేడ్‌ను సెప్టెంబర్ 8న నిర్వహించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 10న మరో 11 మంది అనుమానితుల కోసం గుర్తింపు పరేడ్ జరుగుతుందని చెప్పారు. జైలులో జరిగిన ఈ హింసాకాండకు సంబంధించి మొత్తం 81 మంది అనుమానితులు విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నదని అధికారులు వివరించారు. జైళ్లలో తీవ్రమైన రద్దీ కారణంగా ఖైదీల మధ్య ఘర్షణలను అదుపు చేయడం జైలు అధికారులకు సాధ్యం కాలేదని వెల్లడించారు.