రుద్రంపూర్, సెప్టెంబర్ 09 : భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో పత్తి, మిరప, మొక్కజొన్న, వరి పంటల్లో చీడపీడలు, తెగుళ్ల నివారణపై రైతులకు శిక్షణ కార్యక్రమం బుధవారం కేవీకేలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డా.టి. భరత్ మాట్లాడుతూ… సమగ్ర సస్యరక్షణ (IPM) పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా చీడపీడలను నియంత్రించవచ్చని తెలిపారు. ట్రాప్ క్రాప్స్, ఫెరోమోన్ ట్రాప్స్, స్టిక్కీ ట్రాప్స్, వృక్ష ఆధారిత పురుగుమందులను వినియోగించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో సిఫారసు చేసిన రసాయనిక పురుగుమందులను మాత్రమే వివేకవంతంగా ఉపయోగించాలని సూచించారు. అనంతరం నాలుగు మండలాలకు చెందిన గిరిజన రైతులకు జీవనోపాధి భద్రతలో భాగంగా 20+1 మేకల యూనిట్ పంపిణీ చేశారు. మేకల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందడంతో పాటు కుటుంబాల ఆర్థిక భద్రతను మెరుగుపరుచుకోవచ్చని డా.భరత్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పీవో చైర్మన్ పి.పాపారావుతో పాటు 35 మంది రైతులు పాల్గొన్నారు.