కరీంనగర్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకే వరదకాలువ. ఏకకాలంలో ఎగువనున్న ఎస్సారెస్పీ వైపు, దిగువన మధ్యమానేరు వైపు గోదావరి జలాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు. గడిచిన మూడు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్తుండగా, శనివారం ఉదయం నుంచి వదకాలువ ద్వారా ఎగువన ఉన్న ఎస్సారెస్పీ వైపు ఎత్తిపోస్తున్నారు. ఇదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. కాళేశ్వరం కూలిపోయిందంటూ విషప్రచారం చేసే కాంగ్రెస్ నాయకులు కండ్లుతెరిచి చూస్తే కేసీఆర్ విజన్ ఇట్టే అర్థమవుతుంది. వరదకాలువ 15వ కిలోమీటర్ వద్ద నిరుడు అక్టోబర్ 9న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద గండిపడింది. తొమ్మిది నెలలవుతున్నా ఆ గండిని పూడ్చలేని దుస్థితిలో సర్కార్ ఉన్నది. అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల మేర వరదకాలువలో నీటిని నింపేందుకు కేసీఆర్ నిర్మించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకమే కాంగ్రెస్ సర్కార్‌కు పెద్ద దిక్కుగా మారిన తీరు హాట్‌టాపిక్ మారింది.
కాలువ తవ్వారు.. వదిలేశారు!
1991లో ఆనాటి ప్రధాని పీవీ నర్సింహారావు వరదకాలువకు శంకుస్థాపన చేశారు. 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 122 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వరదకాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 20 టీంఎసీలు దిగువకు పంపించి 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. 2010లో ప్రారంభానికి నోచుకొన్నది. 122 కిలోమీటర్ల వదరకాలువ తవ్వకానికి 19 సంవత్సరాలు పట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన బాబ్లీ వంటి ఎన్నో ప్రాజెక్టులను గోదావరి నదిపై కట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మహారాష్ట్ర సర్కార్ ఎస్సారెస్పీకి వచ్చే నీటికి గండికొడితే ఆనాటి ప్రభుత్వాలు తూతూమంత్రంగా పోరాటం చేశాయే తప్ప.. తెలంగాణకు న్యాయం జరిగే వరకు పోరాడలేదు. దీంతో ఎస్సారెస్పీసహా వరదకాలువ వట్టిపోయింది.
వరద కాలువ రూపాన్ని మార్చిన కేసీఆర్
తెలంగాణలోని అన్ని ప్రాంతాలపై పట్టున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా సమైక్య పాలకులకు భిన్నంగా యోచించారు. కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగానే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.1,9 99.56 కోట్లతో 2017 ఆగస్టు 10న ముప్కా ల్ వద్ద ఈ పథకానికి కేసీఆర్ శంకుస్థాపనన చేశారు. అనతి కాలంలోనే కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి వరదకాలువ ద్వారా ఎదురెక్కించారు. నిజానికి ఉత్తర తెలంగాణకు వరప్రదాయని కావడంతోపాటు గ్రావిటీ ద్వారా సాగునీటి రంగానికి నీటిని అందించే అతిపెద్ద ప్రాజెక్టు ఇది. వీటిని పరిగణనలోకి తీసుకొన్న కేసీఆర్.. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా వరదకాలువను వినియోగించి.. దానిపై మూడు చోట్ల పంపులను ఏర్పాటుచేసి వాటి ద్వారా ఎత్తిపోసి.. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి ఔరా అనిపించారు.
పునరుజ్జీవ పథకం విశిష్టత ఇదే..
శ్రీరాంసాగర్ పాజెక్టు నుంచి మధ్యమానేరు ప్రాజెక్టు వరకు వరదకాలువ పొడవు 122 కిలోమీటర్లు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం ద్వారా గాయత్రీ పంపుహౌస్‌కు నీరు చేరుతున్నది. ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. గాయత్రీ పంపుహౌస్ నుంచి ఎత్తిపోసే నీరు వరదకాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తాయి. ఇక్కడి నుంచి ఎగువకు అంటే ఎస్సారెస్పీ వైపు నీటిని ఎత్తిపోయడానికి జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద (వరదకాలువ 73వ కిలోటర్) మొదటి పంపుహౌస్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావుపేట (వరద కాలువ 34వ కిలోమీటర్) వద్ద రెండో పంపుహౌస్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ (వరద కాలువ 0.10 కిలోమీటర్) వద్ద మూడో పంపుహౌస్ ఏర్పాటుచేశారు.
ఎగువ గోదావరి నుంచి ఎస్సారెస్పీకి నీరు రానప్పుడు.. ఈ పునరుజ్జీవ పథకం కింద రోజుకు ఒక టీఎంసీ చొప్పున రెండు నెలల పాటు 60 టీఎంసీల కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలన్నది ప్రధాన లక్ష్యం. గాయత్రీ పంపుహౌస్ ద్వారా కాళేశ్వరం జలాలు ముందుగా వరదకాలువ 99.02వ కిలోమీటర్ వద్ద కలుస్తుండగా, వరదకాలువ 102వ కిలోమీటర్ వద్ద హెడ్ రెగ్యులేటర్ గేట్లు బిగించారు. గాయత్రీ పంపుహౌస్ నుంచి వచ్చే గోదావరి జలాలు.. హెడ్ రెగ్యులేటర్ గేట్లు తెరిస్తే దిగువన ఉన్న మధ్యమానేరుకు మూసివేస్తే.. శ్రీరాంసాగర్ కు ఎత్తిపోసేవిధంగా రూపకల్పన చేశారు. గా యత్రీ పంపు నుంచి రోజుకు రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పు డు.. మధ్యమానేరుకు జలాశయానికి ఒక టీ ఎంసీ, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం కింద ఒక టీఎంసీ తీసుకునేలా గేట్లు ఏర్పాటు చేశారు.
40 లక్షల ఎకరాలకు నీరందేలా డిజైన్
పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ పరిధిలోని 13.60 లక్షల ఎకరాలకు నీరందించడంతోపాటు ఉత్తర తెలంగాణలో 40 లక్షలకు పైగా భూములకు నీరు అందించే విధంగా డిజైన్ చేశారు. పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీని నిపండమే కాదు.. 122 కిలోమీటర్ల పొడవునా వరదకాలువను నిండుకుండలా మార్చడం, పరీవాహక ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపే విధంగా ఏర్పాట్లుచేశారు. వరదకాలువ పొడువునా సమైక్య సర్కార్ 1అశాస్త్రీయంగా 16 తూములను ఏర్పాటు చేస్తే.. వాటిని సరిచేయడంతోపాటు 34 తూములు ఏర్పాటు చేసి, 80 చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకున్నారు. వరద కాలువ 15వ కిలోమీటర్ వద్ద నిరుడు అక్టోబర్ 9న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద గండిపడింది.
ఇది యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన పని. పునరుజ్జీవ పథకం ద్వారానే ఎగువకు నీటిని ఎత్తిపోస్తున్న కాంగ్రెస్ సర్కార్.. గండి పూడ్చే విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నది. తొమ్మిది నెలులవుతున్నా పనులు మొక్కుబడిగాగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి నీళ్లొచ్చినా వరద కాలువకు గండిపడటంతో దిగువకు నీరివ్వలేని దుస్థితి నెలకొన్నది. నాడు కేసీఆర్ నిర్మించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకమే బహుళ ప్రయోజనకారిగా .. రైతులపాలిట వరంగా మారింది. మూడు రోజులుగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన పంపుహౌస్‌ల ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని మధ్యమానేరుకు ఎత్తిపోస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటల నుంచి వరదకాలువ ద్వారా ఎగువకు కూడా నీటిని ఎత్తిపోస్తున్నారు.
16 తూములు.. 80 చెరువులకు నీరు
ప్రస్తుతం వరదకాలువ ద్వారా ఎత్తిపోస్తున్న నీటి వల్ల ఆ కాలువపై ఏర్పాటుచేసిన 16 తూముల నుంచి దాదాపు 80 చెరువులు నింపుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాదు.. వరద కాలువ మొత్తంలో దాదాపు 1.5 టీఎంసీల నీరు నిలువ ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా భూగర్భజలాలు భారీగా పెరిగి అయకట్టు రైతులకు వరంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎస్సారెస్పీ పునర్జీవం పథకాన్ని కేసీఆర్ పూర్తిచేసి ఉండకపోతే.. ఇప్పుడు వరదకాలువ ద్వారా ఎగువకు నీరు ఎలా వెళ్లేవని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం నీరు గారిపోయిందని, పనికి రాకుండాపోయిందని విమర్శలు చేసే కాంగ్రెస్ నాయకులు.. ఒక్కసారి ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని చూస్తే. కేసీఆర్ ఆలోచనా సరళి, రైతులకోసం సాగునీటి రంగంలో చేసిన ప్రయత్నం, తద్వారా ప్రయోజనాలు అర్థమవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేపటిలోగా గండి ప్రదేశం వరకూ నీరు
ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గాయత్రీ పంపుహౌస్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. 10 వేల క్యూసెక్కుల ప్రవాహంతో నీటిని దిగువన ఉన్న మధ్యమానేరు జలాశయానికి విడుదల చేస్తుండగా, ఎస్సారెస్పీ వైపు 5,750 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద పంపుహౌస్ వద్ద ఆరు పంపులను ప్రారంభించి, అక్కడి నుంచి.. రాజేశ్వర్రావుపేట పంపుహౌస్‌కు ఎత్తిపోస్తున్నారు. సోమవారం ఉదయం కల్లా రాజేశ్వర్రావుపేట పంపుహౌస్ వద్దకు నీరు చేరుకొనే అవకాశం ఉన్నది. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తే ప్రస్తుతం వరద కాలువకు పడిన గండి ప్రదేశం వరకు నీరు వెళ్తుంది. అంటే గండి పడిన స్థలం నుంచి ఎస్సారెస్పీ వైపు 15 కిలోమీటర్ల పొడవులో వరదకాలువకు ఈ నీటిని పంపించే పరిస్థితి ఉండదు.