Sam Altman : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) తో కొన్ని చెడు పరిణామాలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ దానితో ఉన్న ప్రయోజనాల కోసం ప్రపంచం వాటిని అంగీకరించాలని ఓపెన్ఏఐ సీఈవో (Open AI CEO) శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పొలిటికో డీకోడెడ్’ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఏఐ టెక్నాలజీ (AI Technology) మానవాళికి మేలు చేయాలంటే కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొనక తప్పదని ఆయన స్పష్టంచేశారు.
ఏఐ సాంకేతికతను కేవలం ఒకే ల్యాబ్ నియంత్రణలో ఉంచి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలనే వాదనను శామ్ ఆల్ట్‌మన్ తోసిపుచ్చారు. ఇది ఆమోదయోగ్యంకాని రాజీ అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఏఐ టెక్నాలజీపై నియంత్రణ ఉండాలన్నా, దాని ప్రయోజనాలు అందాలన్నా కొన్ని చెడు పరిణామాలు జరగడాన్ని ప్రపంచం అంగీకరించాల్సి ఉంటుందని ఆల్ట్‌మన్ చెప్పారు. హ్యాకింగ్, స్కామ్‌లు, ఇతర దుర్వినియోగాలకు భయపడి ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
ప్రజలకు ఏఐతో చెడు కంటే మేలే ఎక్కువ జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ఈ క్రమంలో తమ సంస్థ ఓపెన్ఏఐ తేలికపాటి నియంత్రణను సమర్థిస్తుందని అన్నారు. ఈ విషయంలో తమకు మరో ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కు భిన్నమైన దృక్పథాలు ఉన్నాయని చెప్పారు. మొత్తం మీద ఏఐ పురోగతికి కొన్ని రిస్కులను స్వీకరించడం తప్పనిసరనే అభిప్రాయాన్ని ఆల్ట్‌మన్ బలంగా వినిపించారు.