Aaryavir : భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag) కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) కు క్రికెట్లో ప్రమోషన్ వచ్చింది. 2026-27 దేశవాళీ సీజన్లో జరిగే వినూ మన్కడ్ టోర్నీ (Vinoo Mankad Tourney) కి ఢిల్లీ అండర్-19 జట్టు (Delhi Under-19 Team) కెప్టెన్‌గా ఆర్యవీర్‌ను ఎంపిక చేశారు. 18 ఏళ్ల ఆర్యవీర్ ఇటీవలే భారత అండర్-19 జట్టులోకి అరంగేట్రం చేశాడు.
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో ఆర్యవీర్ 28, 47, 34 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-0 తో గెలిచింది. మూడు మ్యాచ్‌లలోనూ మంచి ఆరంభాలు ఇచ్చినప్పటికీ భారీ స్కోర్లు చేయలేకపోయానని ఆర్యవీర్ చెప్పాడు. భారత అండర్-19 జట్టుతో ఆడిన అనుభవం తనకు కీలక పాఠాలు నేర్పిందని తెలిపాడు. మ్యాచ్‌ను వివిధ దశలుగా విభజించుకుని ఆడాలని, భారీ పరుగులు చేయాలంటే ఎక్కువసేపు క్రీజులో నిలవాలని తెలుసుకున్నానని చెప్పాడు.
క్రికెట్లో గుర్తింపు రావాలంటే పెద్ద స్కోర్లు చేయడం ముఖ్యమని ఆర్యవీర్ అన్నాడు. ఆర్యవీర్ గతంలోనే తన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2024 లో కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై ఢిల్లీ తరఫున ఏకంగా 297 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున కూడా ఆడాడు. తండ్రి సెహ్వాగ్ దిగ్గజ క్రికెటర్ అయినందువల్ల తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టంచేశాడు. తన తండ్రి భారత్ కోసం చేసిన సేవలపై ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు.
ఇప్పుడు ఢిల్లీ అండర్-19 కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన ఆర్యవీర్.. తన బ్యాటింగ్‌తోపాటు నాయకత్వంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.