Nominations | బిగ్‌బాస్ తెలుగు 10లో ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ముగియడంతో.. ఇప్పుడు సోమవారం నామినేషన్స్ ప్రక్రియకు తెరలేచింది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే ఈ వారం నామినేషన్స్ కాస్త గట్టిగానే జరిగేలా కనిపిస్తోంది. సాధారణంగా నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య వాదనలు, ఆరోపణలు, పాత గొడవలు బయటకు రావడం కామన్. కానీ ఈసారి బిగ్‌బాస్ పెట్టిన టాస్క్ కారణంగా ఆ వేడి మరింత పెరిగినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈసారి బిగ్‌బాస్ నామినేషన్స్ కోసం ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చాడు. ఓ గుమ్మడికాయను ఇంట్లో ఎక్కడో దాచిపెట్టి.. ఇద్దరేసి కంటెస్టెంట్లను పిలుస్తారు. ఆ ఇద్దరిలో ఎవరు గుమ్మడికాయను ముందుగా దక్కించుకుంటారో.. వారికి నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది.
నామినేషన్ చేసే కంటెస్టెంట్ ఎవరిని నామినేట్ చేశాడో వారి ముందు ఉంచిన దిష్టిబొమ్మల కుండను పగలగొట్టాల్సి ఉంటుంది. దీంతో నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్లకు తమ కారణాలను చెప్పడంతో పాటు.. తమ కోపాన్ని కూడా బయటపెట్టే అవకాశం లభించింది. ఈ ప్రక్రియలో రామ్ ప్రసాద్.. అమన్‌ను నామినేట్ చేసినట్లు ప్రోమోలో కనిపించింది. ఇందుకు కారణంగా గతంలో త్రిగుణ్‌కు ఆటలో గాయం అయిన ఘటనను ప్రస్తావించాడు. ఆ సంఘటనను గుర్తు చేస్తూ అమన్‌పై రామ్ ప్రసాద్ తీవ్రంగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది.అయితే రామ్ ప్రసాద్ ఆరోపణలకు అమన్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. త్రిగుణ్‌కు సంబంధించిన విషయం కావడంతో అతడు కూడా ఈ వాదనలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్రిగుణ్ పేరు రావడంతో మొదలైన ఈ వాదన క్రమంగా పెద్ద గొడవగా మారింది. అపూర్వ, రోహిత్, వంశీ, నరేష్ కూడా ఈ చర్చలోకి వచ్చినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. దీంతో ఒకరి నామినేషన్ మరో కంటెస్టెంట్ జోక్యంతో పెద్ద వాదనగా మారినట్లు కనిపిస్తోంది.ఇప్పటికే హౌస్‌లో కొన్ని గ్రూపులు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. నామినేషన్స్ సమయంలో పాత గొడవలు కూడా బయటకు రావడంతో వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది.మరోవైపు ముకేశ్.. అపూర్వను నామినేట్ చేసినట్లు ప్రోమోలో కనిపించింది. గత వారం ఆమె కెప్టెన్‌గా ఉన్న సమయంలో వ్యవహరించిన తీరును ముకేశ్ తన నామినేషన్‌కు కారణంగా చెప్పినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా ఉన్న సమయంలో అపూర్వ ఓవర్‌యాక్షన్ చేసిందని, పొగరుగా వ్యవహరించిందని ముకేశ్ ఆరోపించాడు. గత వారం జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ ఆమెను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది.
ముకేశ్ నామినేషన్ సమయంలో జరిగిన చర్చలో వర్షిణి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో అపూర్వ తనను తిట్టిన విషయాన్ని వర్షిణి ప్రస్తావించింది. అంతేకాకుండా అపూర్వ కెప్టెన్సీపై నాగార్జున చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేసింది.అపూర్వను నాగార్జున ‘డిజాస్టర్ కెప్టెన్’గా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వర్షిణి ఆమెతో వాదించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమో సూచిస్తోంది. ఇక త్రిగుణ్ కూడా అపూర్వను నామినేట్ చేసినట్లు సమాచారం. దీంతో అపూర్వపై వరుసగా నామినేషన్స్ రావడంతో ఆమె కూడా గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది. త్రిగుణ్, అపూర్వ మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమోలో కనిపిస్తోంది.