నా పదహారేళ్ల వయసులో పత్రికలు, పుస్తకాలు బాగా చదవడం అలవాటయ్యింది. ఒక వారపత్రికను నేను గంటలో చదివేసేదాన్ని. అదే మాసపత్రికయితే చిన్న నవలతో కలిపి రెండు గంటలు. ఇక పెద్ద నవలయితే ఓ రోజులోనే చదివేసి ఇంకో పుస్తకం కోసం చూసేదాన్ని. అంటే ‘పుస్తక బకాసురి’ అనొచ్చు.
మాఇంట్లో అందరూ హాస్యాన్ని ఇష్టపడేవారే. అమ్మ ఏ విషయమైనా హాస్య ధోరణిలో చెబుతూ ఉండేది. తను మా మీద కూడా జోకులేసేది. ఎప్పుడైనా డల్‌గా ఉంటే “ఈడుపు కాళ్లు ఏడుపు మొహం- ఇతడేనా ఇల్లింటపు అల్లుడు’ అన్నట్లు గట్లున్నవేంది?’ అనేది. ఎవరైనా అలిగి మొహం మాడ్చుకుంటే ‘పేలాలు ఏయించే పెంక తీరుగ మొహం అట్ల పెట్టినవేంది?’ అంటూండేది. ఎవరికైనా కోపం వస్తే ‘తుమ్మల్ల పొద్దు గుంకినట్టు అదేం మొహం?’ అని నవ్వేది. అలా ఎప్పుడూ ఏదైనా సందర్భాన్నో, కొందరి విచిత్రమైన మేనరిజమ్స్నో, మాటలనో తల్చుకుని ఇంటిల్లిపాదీ నవ్వుకుంటూ ఉండేవాళ్లం. బాగా నవ్వడం, నవ్వించడం నాకలాగే అలవాటయిందనుకుంటాను.
అప్పట్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వంటి వారపత్రికలు, యువ, జ్యోతి, స్వాతి వంటి మంత్లీలు రెగ్యులర్‌గా చదువుతూ ఉండేదాన్ని. ఆ పత్రికల్లో వచ్చే కార్టూన్లు నన్నెంతగానో ఆకర్షించేవి. పుస్తకం తెరవగానే మొదట గబగబా కార్టూన్లు చూశాకే మిగతా వాటి జోలికి వెళ్లేదాన్ని. ముఖ కవళికలు, దేహభాష, మూడ్ ఇలాంటివన్నీ బొమ్మను చూడగానే అర్థమయ్యేట్టు ఎలా వేస్తారో అని అబ్బురంగా అనిపించేది. బొమ్మకు వేసే డ్రెస్సును, ధరింపజేసే వస్తువులను, పరిసరాలను బట్టి కూడా ఏ వయసు వారో, ఏ వృత్తివారో కూడా తెల్పడం ఆశ్చర్యంగా తోచేది.
ముఖ్యంగా స్వాతి మాసపత్రికలో జయదేవ్, బాబు గార్ల కార్టూన్లు విరివిగా వచ్చేవి. ఒక సంచికలో ఒకే సబ్జెక్టు మీద పదులకొద్దీ కార్టూన్లు వేసేవారు. కార్టూన్లలో ఒక చిన్న మాటతో, సంభాషణతో కూడిన బొమ్మలు ఎంతో నవ్వు తెప్పించడం, ఆలోచనను రేకెత్తించడం నాకు బాగా నచ్చేది. కొన్నిసార్లు అసలు వ్యాఖ్య లేకపోయినా కార్టూన్ అర్థమై నవ్వు తెప్పించేది. రానురానూ నేనూ అలా బొమ్మలతో, మాటలతో కార్టూన్లు గీయాలనే కోరిక బుర్రలో రంగులరాట్నంలా తిరుగుతూ ఉండేది. మొత్తానికి ఏ తెల్ల కాగితం దొరికినా, లేకపోతే నోట్ బుక్ లో మధ్య పేజీ చించయినా సరే కార్టూన్లు గీయడం మొదలుపెట్టాను.
మొదట్లో నాకు కార్టూన్లు ఎలా… అంటే ఏ పేపర్ పై, ఏ సైజులో, ఎలాంటి పెన్నుతో గీయాలో కూడా తెలిసేది కాదు. ప్రత్యక్ష గురువులూ లేరు. అసలు ఎవర్ని అడగాలో కూడా తెలియదు. కానీ, జయదేవ్ గారి బొమ్మలు నాకు బాగా నచ్చి ఆయనకు ఏకలవ్య శిష్యురాలిగా మారిపోయాను. కొన్నాళ్లు ఆయన బొమ్మలను అనుసరించి వేసినా, తొందరలోనే నా శైలి నాకు ఏర్పడింది. అలా మూడు పెన్సిల్ గీతలు, ముప్పై ఆరు చెరిపివేతలుగా గీస్తూ, ఎరేజర్‌తో తుడిపేస్తూ… తొందర్లోనే బొమ్మలు గీయడంలో ప్రావీణ్యం సంపాదించాను.
మొత్తానికి ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అన్నట్టు నా కార్టూన్లు నాకు బాగానే ఉండేవి. మరి పత్రికల్లో నా వాటా, నా కోటా నాకు ఉండాలని కోరుకోవడం ‘తప్పా.. తప్పా.. తప్పా?’ అని జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ ‘చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..’ పాటలో అరిచినట్టుగా లోపల్లోపలే అనుకొనేదాన్ని. కొన్ని పత్రికలకు నా కార్టూన్లు ఎంతో ధైర్యంగా, సరియగు తిరుగు స్టాంపులున్న కవరు కూడా జత చేసి పంపగా అవన్నీ ‘నిను వీడి క్షణమైనా మేం ఉండగలమా?’ అన్నట్లు నన్ను వెతుక్కుంటూ వచ్చేశాయి.
‘హా.. ఏమి నా పాపము? ఇది ఆ పరమేశ్వరుడిచ్చిన శాపము’ అనుకొనినదానినై కూడా వెనుదిరగలేదు, కార్టూన్లు వేయుట మానలేదు. ఆ పరంపరలో ఓసారి స్వాతి మంత్లీ వాళ్లు కార్టూన్ల పోటీ పెడుతూ నిబంధనలు వివరించారు. కార్టూన్ డ్రాయింగ్ పేపర్‌పై ఇండియన్ ఇంక్‌తో మాత్రమే వేయాలనీ, ఆరు ఇంటూ నాలుగు సైజులోనే వేయాలనీ.. ఇలా అరటిపండు ఒలిచినట్టు చెప్పారు. కానీ, తినాల్సింది నేనే కదా! మొత్తానికి వెంటనే డ్రాయింగ్ షీట్, ఇండియన్ ఇంక్, బ్రష్‌లు.. ఇలా సరంజామా అంతా కొనుక్కుని, సైజులో కట్ చేసుకుని గీసి పంపాను. ఈ లోగా అమ్మ ఏందే! చదువు చారెడు, బలపాలు దోసెడు’ అన్నట్టు నువ్వు గీసుడేమో గానీ, ఇంటి నిండా కాయితాలు, పెన్సిళ్లే కనబడుతున్నయి అన్నది. ‘హాఁ ఎంతటి అవమానము!’ అయినా ‘నవ్విన నాపచేనే పండుతుంది’ లేక ‘నవ్వని మనుషులే నా కార్టూన్లకు నవ్వుతారు’ అని గుండె దిటవు చేసుకున్నాను.
ఇంతకూ నా కార్టూను నచ్చి స్వాతి వాళ్లు ప్రత్యేక బహుమతినిచ్చారు సుమా! అలా నా మొట్ట మొదటి కార్టూన్ 1980 ఫిబ్రవరి స్వాతి మాసపత్రికలో వచ్చింది. పాతవన్నీ తిరిగి డ్రాయింగ్ షీట్ మీద గీసి పంపితే అన్నీ అచ్చయ్యాయి. ఇక అప్పటి నుంచీ సుమారు వెయ్యి దాకా నా కార్టూన్లు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. స్వాతి, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి నన్ను ఎక్కువగా ప్రోత్సహించాయి. ఒక్కో నెలలో ఇరవై, ముప్పై దాకా నా కార్టూన్లు అచ్చయ్యేవి. నేను ఎక్కువగా వ్యాఖ్య లేకుండానే నవ్వు తెప్పించే లేదా తక్కువ వ్యాఖ్యతో ఎక్కువగా బొమ్మతోనే నవ్వించే కార్టూన్స్‌ని ఇష్టపడతాను. నేను గీసినప్పుడు మహిళల్లో అప్పటికే లబ్ధప్రతిష్ఠురాలైన రాగతి పండరి గారు తప్ప మహిళా కార్టూనిస్టులే లేరని చెప్పొచ్చు. తెలంగాణాలో బహుశా నేనే మొదటి మహిళా కార్టూనిస్ట్ అనుకుంటాను!
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి