వాషింగ్టన్, మార్చి 14: అమెరికాలో వీసాల జారీ ఆంక్షలు కఠినతరం కావడంతో అక్కడ అమల్లో ఉన్న నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఫేక్ దోపిడీలకు పాల్పడిన 11 మంది భారతీయులను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. యూ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటూ బాధితుల హోదాను తప్పుగా పొందేందుకు దుకాణాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిని మాసాచుసెట్స్, బోస్టన్‌లో యూఎస్ అధికారులు అరెస్ట్ చేశారు.
అసలు ఇదంతా ఎలా జరుగుతుందంటే.. కొన్ని చిన్న స్టోర్లలో నకిలీ దొంగతనానికి ఉద్యోగులు ప్రణాళిక వేస్తారు. దీనిని నిర్వహించేందుకు వారే దోపిడీ దొంగల అవతారం ఎత్తుతుంటారు. దీని ప్రకారం వారిలో ఒక వ్యక్తి ముసుగు ధరించి చేతిలో ఆయుధంతో స్టోర్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించి కొంత సొమ్ము అపహరించుకుపోతాడు.
ఈ దోపిడీ అంతా అక్కడ ఉన్న సీసీటీవీల్లో రికార్డు అవుతుంది కాబట్టి, దర్యాప్తునకు వచ్చిన పోలీసులు అక్కడ చోరీ జరిగినట్టు నివేదిస్తారు. ఇక్కడే అసలు మర్మం ఉంది. అలా దోపిడీకి గురైన ఉద్యోగులను ఒక బాధిత క్యాటగిరీగా భావిస్తారు. అలాంటి వారు యూ నాన్ ఇమిగ్రెంట్ వీసా (యూ వీసా)కు దరఖాస్తు చేసుకుంటే సులువుగా మంజూరు చేస్తారు. యూ వీసా పొందడం కోసం కొందరు భారతీయులు ఇలా తప్పుడు దారిలో ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. మసాచుసెట్స్‌లో ఆరుగురు, బోస్టన్‌లో నలుగురు భారతీయులను అరెస్ట్ చేశారు. నిందితులు 2023 నుంచి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.