కాజీపేట, జూన్ 4 : పట్టాలపై పెద్ద బండరాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చటర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే జంక్షన్- పెండ్యాల్ రైల్వే స్టేషన్ల మధ్యలోని మడికొండ శివారులో కిలోమీటర్ నంబర్ 320 వద్ద ఇద్దరు వ్యక్తులు ఈ నెల 1వ తారీకున ఆఫ్ డౌన్లో రైలు పట్టాలపై పలు చోట్ల పెద్ద బండరాళ్లు పెట్టారు.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గరీభ్థ్ రైలు డ్రైవర్లు పట్టాలపై ఉన్న బండరాళ్లను చాలా దూరం నుంచి గుర్తించి రైళ్లను నిలిపివేశారు. అనంతరం రాళ్లను తొలగించడంతో రెండు రైళ్లకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. డ్రైవర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు మెసేజ్ చేశారు. వారి ఆదేశాలతో రైల్వే ఆర్పీఎఫ్ విచారణ చేపట్టి ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి చెందిన సంచన్ మార్కం (27), మహేశ్వర్ (25)లను అదుపులోకి తీసుకున్నారు.
మడికొండ శివారు లో మద్యం తాగిన మైకంలో ఆకతాయి చేష్టలతో రైలు పట్టాలపై బండ రాళ్లు పెట్టినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో వారిపై రైల్వే ఆర్పీఎఫ్ యాక్టు కింద పలు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్-ఇప్పగూడ రైల్వే స్టేషన్ల మధ్య గత నెల 30వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లతో దాడి చేశారు. రైలు డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, దాడికి పాల్పడిన స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన వీ భిక్షపతిని అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ చటర్జీ వివరించారు.