ములుగు, మే 6(నమస్తే తెలంగాణ) : తోటి ఉద్యోగి వద్ద లంచం ఆశించి వక్రబుద్ధి చూపించగా బాధితుడు ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులకు పట్టించిన ఘటన ములుగు జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈమేరకు హనుమకొండ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నేరెళ్లపల్లి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో 2023, 2024లో పలుమార్లు మెడికల్ లీవ్ పొంది ఉన్నాడు. 2025 జనవరి నుంచి విధులకు రెగ్యులర్‌గా హాజరవుతున్నాడు.
మెడికల్ లీవ్‌కు సంబంధించిన పీరియడ్ మొత్తానికి బిల్లులు చెల్లించాలని కోరుతూ జడ్పీ సీఈవోకు దరఖాస్తు చేసుకోగా ఆయన ఆమోదించి సూపరింటెండెంట్‌కు ఫైల్ పంపారు. సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొమ్ము సౌమ్యారెడ్డి రూ.3,50,424ల బిల్లును తయారు చేసి, ట్రెజరీకి పంపించాలంటే తమకు రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి విడతలో సుధాకర్‌కు రూ.20వేలు, సౌమ్యరెడ్డికి రూ.5వేలు ఇవ్వాలని, మిగిలిన డబ్బులు బిల్ పాస్ అయిన తర్వాత ఇవ్వాలని చెప్పారు.
అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే తన డబ్బులు పొందే విషయంలో లంచం ఇవ్వడం ఇష్టం లేక హనుమకొండలోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
సౌమ్యారెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.5వేలను కూడా సుధాకర్‌కు ఇవ్వాలని వెంకటేశ్వర్లుకు చెప్పగా, ఆమె సూచన మేరకు రూ.25వేలను మంగళవారం వెంకటేశ్వర్లు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.25వేలను సీజ్ చేసి వారిద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ సాంబయ్య వివరించారు. ఏసీబీ దాడుల్లో సీఐలు ఎస్ రాజు, ఎల్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.