నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం గా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. పిడుగుపాటుకు కురవి మండలంలో ఒకరు, కౌసల్యదేవిపల్లిలో రెండు మేకలు మృతి చెందాయి. గాలి దుమారానికి ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి.
మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని శనిగపురం, ఈదులపూసపల్లి, ముడుపుగల్, అయోద్య, మల్యాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొత్తం తడిసిపోయింది. గాలి దుమారంతో ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ని రేకుల షెడ్డులో రేకులు గాలికి ఎగిరిపోయాయి. కేసముద్రం మారెట్ యార్డులో మకజొన్న, ధాన్యం, కల్లాల వద్ద ఆరబోసిన మక్కలు మొత్తం తడిసిముద్దయిపోయాయి తాళ్లపూసపల్లి గ్రామంలో బత్తిని సమ్మయ్య తన వ్యవసాయ భూమి వద్ద కట్టేసుకున్న మూడు కాడెడ్లు పిడుగుపాటుతో మృతిచెందాయి. డో ర్నకల్ మండలంలోని అమ్మపాలెం, ఉయ్యాలవాడ, వెన్నారం, తోడేళ్లగూడెం, ముల్కలపల్లి మన్నెగూడెం, పెరుమాండ్ల సంకీస, గొల్లచర్ల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
బయ్యారం మండలంలోని నారాయణపురం, మిర్యాలపెంట, కంబాలపల్లి గ్రామాల్లో బలంగా వీచిన గాలులకు ఇండ్లపై కప్పు లు లేచిపోయాయి. కల్లాల్లో ఉన్న మక్కలు, ధాన్యం తడిసిపోయాయి. గార్ల మండలంలో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. మరిపెడ మండలంలో కళ్లముందే వరద నీటిలో కొట్టుకుపోతున్న వడ్లను చూసి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. నర్సింహులపేట మండల కేంద్రంతోపాటు పెద్దనాగారం, గోపతండా, పెద్దనాగారం స్టేజీ, వస్రంతండా, జగ్గుతండా, పెద్దనాగారం స్టేజీ, రామన్నగూడెం,కొమ్ములవంచ, ముంగిమడుగు, జయపురం గ్రామాల్లో, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
వరంగల్ జిల్లా నెక్కొండలో గాలివానకు సుమారు 80వేల బస్తాల మక్కలు వర్షార్పణమయ్యాయి. కురవి మండలం సుదనపల్లి గ్రామానికి చెందిన నీలం వెంకన్న(40) పిడుగుపాటుతో మృతి చెందాడు. కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేస్తున్న వెంకన్నపై ఒక్కసారిగా పిడుగుపడగా, కుప్పకూలిపోయాడు. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో పిడుగుపాటుకు మూడు కాడెడ్లు, నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి గ్రామంలో ఏర్పుల వెంకన్నకు చెందిన రెండు మేకలు పిడుగుపాటుకు మృతిచెందాయి.

అన్నదాతకు సాయం..
నర్సింహులపేట: అకాల వర్షం.. గాలి దుమారం నర్సింహులపేటలోని మక్కల కొనుగోలు కేంద్రంలో రైతులను ఆగమాగం చేశాయి. టార్పాలిన్లు లేచిపోయి తడుస్తున్న మక్కలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతుండగా, అక్కడే వివాహ వేడుకకు హాజరైన కొందరు యువకులు చలించిపోయారు. రైతులకు సాయం చేశారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పెండ్లికి వచ్చిన గూడూరు మండలం ఏపూరికి చెందిన పదిమంది యువకులు వానలో తడుస్తూ రైతుల మక్కలను కుప్పలుగా పోసి టార్పాలిన్లు కప్పారు. యువకులు చేసిన సాయానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.