పోచమ్మమైదాన్, మార్చి 19: అత్యాశకు పోయి రూ. 2.32 లక్షలు పోగొట్టుకున్నాడు. రేటింగ్‌తోపాటు పెట్టుబడికి డబుల్ ఆదాయం ఇస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి పంపిన మెసేజ్‌కి ఓ ప్రైవేట్ ఉద్యోగి బలయ్యాడు. వరంగల్ నగరంలోని మట్టెవాడ సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. మట్టెవాడకు చెందిన యాద కౌశిక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 14న తన వాట్సాప్‌కు ఓ సెల్ నంబర్ నుంచి ‘నీకేమైనా పార్ట్‌టైమ్ జాబ్ కావాలా’ అంటూ మెసేజ్ వచ్చింది. తనకు వద్దంటూ కౌశిక్ తిరిగి సమాధానం ఇచ్చాడు. ఈసారి అతడి మెయిల్‌కు ‘నీవు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి, గ్రాండ్ హయత్ ముంబై హోటల్‌కు రేటింగ్ ఇస్తే నీ ఖాతాలో డబ్బులు వేస్తాం’ అంటూ మెసేజ్ పంపి నమ్మించాడు. ఆ మాటలను నమ్మిన కౌశిక్ రేటింగ్ ఇవ్వగా, తన ఖాతాలో కొన్ని డబ్బులు క్రెడిట్ చేశాడు. తర్వాత టెలిగ్రాం లింక్‌లో జాయిన్ కావాలని చెప్పి రేటింగ్ స్క్రీన్ పంపిస్తే 50 రూపాయల చొప్పున క్రెడిట్ చేస్తామని చెప్పగా.. 10 నుంచి 12 సార్లు రేటింగ్ ఇచ్చాడు. మరుసటి రోజు రూ. 2000 పెట్టుబడి పెడితే రూ. 2,800 వస్తాయని చెప్పాడు. దీంతో కౌశిక్ రూ. 2 వేలు చేశాడు. మళ్లీ రూ. 5 వేలు, రూ. 29 వేలు, రూ. 48 వేలు, రూ. 50 వేల చొప్పున పలుమార్లు కౌశిక్‌తో గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు కట్టించుకున్నాడు. ఇవన్నీ తిరిగి రావాలంటే మరో రూ. 30 వేలు కట్టాలని చెప్పగానే అవి కూడా కట్టాడు. ‘మీరు పంపిన డబ్బులను రేపు నీ ఖాతాలో జమ చేస్తాం’ అని నమ్మించారు. అయితే, 16వ తేదీన రావాల్సిన డబ్బుల కోసం కౌశిక్ మెసేజ్ పెట్టాడు. చివరగా రూ. 68 వేలు కడితే మొత్తం డబ్బులు పంపిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో మళ్లీ రూ. 68 వేలు పంపించి ఎదురుచూశాడు. ఇలా పలు వాయిదాలుగా కౌశిక్ మొత్తం రూ. 2,32,000 పంపించగా, నయాపైసా రాకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.