నల్లబెల్లి, డిసెంబర్ 28 : పులి గాండ్రింపులతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల మీదుగా రుద్రగూడెం గ్రామ పరిసర పంట పొలాల్లో పులి సంచరించినట్లు పాదముద్రల ద్వారా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. కాగా, శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో రుద్రగూడెం పరిసర పంట పొలాల్లో నుంచి ఎన్‌హెచ్-365 మీదుగా వెళ్తున్న చిన్నతండాకు చెందిన గుగులోత్ పద్మకు పులి కంటపడడంతో కేకలు వేసుకుంటూ ఇంట్లోకి పరుగులు పెట్టినట్లు ఆమె తెలిపింది.
దీంతోపాటు ఒల్లెనర్సయ్యపల్లెకు చెందిన ఓ రైతు మక్కజొన్న చేనులో పులి గాండ్రింపులను విన్న గ్రామస్తులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని ఫారెస్ట్ అధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీఎఫ్‌వో సృజన, ఏసీపీ కిరణ్‌కుమార్, ఎఫ్ఆర్వో రవికిరణ్, ఎస్సై గోవర్ధన్‌తోపాటు ఫారెస్ట్, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పులుల కోసం గాలింపు చేపట్టారు. అయినా వాటి ఆచూకీ గుర్తించలేకపోయారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో, ఏసీపీ మాట్లాడుతూ.. మండలంలో పులుల సంచారం వాస్తవమేనని, ప్రజలు రాత్రి సమయాల్లో, విడివిడిగా పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. పులుల ఆచూకీ లభిస్తే ఫారెస్ట్ అధికారులకు ఇవ్వాలన్నారు.
నర్సంపేట: నలబెల్లి మండలంలో పెద్ద పులి సంచారంతో నర్సంపేట సమీప గ్రామాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. నల్లబెల్లికి సరిహద్దుగా ఉన్న దుగ్గొండి, ఖానాపురం, నర్సంపేట మండలాల్లోని గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్టు అధికారులు, నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి, ఎస్సైలు అరుణ్‌కుమార్, నవీన్‌కుమార్‌లు సమీప గ్రామాల ప్రజలకు ఆటోలకు మైకులు పెట్టి సూచనలు చేశారు.