టేక్మాల్, మార్చి 17: మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని వేల్పుగొండ గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లికుంటతండా సమీపంలో చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బొల్లికుంటతండాకు చెందిన పూల్యానాయక్ సోమవారం రాత్రి పొలానికి వెళ్తుండగా దారిలో చిరుత కనిపించిందని స్థానికులకు చెప్పగా వారు స్థానిక సర్పంచ్ దాసుకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అతను మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ చిరుత సంచరించినట్లు పాదముద్రలు గుర్తించారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులను సర్పంచ్ అప్రమత్తం చేశారు. వెంటనే గ్రామంలో దండోరా వేయించారు. అడవి వైపు పశువులను మేతకు తీసుకువెళ్లవద్దని, ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఈ విషయమై ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.