Exercise | వ్యాయామం వల్ల కండరాలు, శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించే ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో రోగనిరోధక వ్యవస్థ కూడా వయసుతోపాటు అంతగా క్షీణించే అవకాశాలు ఉండవని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ శారీరక చురుకుదనం కొనసాగించడం ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ అధ్యయనం కోసం 55 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 125 మంది ఔత్సాహిక సైక్లిస్టులను పరిశోధకులు ఎంపిక చేశారు. వీరిలో 84 మంది పురుషులు, 41 మంది మహిళలు ఉన్నారు. పురుషులు 6.5 గంటల్లో 100 కిలోమీటర్లు, మహిళలు 5.5 గంటల్లో 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. ధూమపానం చేసేవారు, అధికంగా మద్యం సేవించేవారు, రక్తపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని అధ్యయనం నుంచి మినహాయించారు.
పాల్గొన్నవారికి పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయని పెద్దలతో వారి ఫలితాలను పోల్చారు. వ్యాయామం చేయని గ్రూపులో 57 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 75 మంది ఆరోగ్యవంతులు ఉన్నారు. వీరితోపాటు 20 నుంచి 36 ఏళ్ల మధ్య వయసున్న 55 మంది ఆరోగ్యవంతులను కూడా పోలిక కోసం పరిశీలించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే సైక్లిస్టుల్లో వయసు పెరిగినా కండరాల పరిమాణం, కండరాల బలం తగ్గడం కనిపించలేదని అధ్యయనం వెల్లడించింది. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ శరీర కొవ్వు లేదా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం కూడా కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. వ్యాయామం వృద్ధాప్యంతో వచ్చే కొన్ని శారీరక మార్పులను తగ్గించడంలో సహాయపడుతుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ సైక్లిస్టులు భవిష్యత్తులోనూ సైక్లింగ్‌ను కొనసాగిస్తూ తమ శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారో పరిశీలించేందుకు పరిశోధకులు తదుపరి అధ్యయనాలను కొనసాగించాలని భావిస్తున్నారు.
వ్యాయామంతోపాటు ఆహారం కూడా ఆరోగ్యకరమైన వృద్ధాప్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైన కొవ్వులైన మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు (MUFA), ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లకు మంచి మూలం. శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందించడంలో ఇది సహాయపడుతుంది. అధిక కోకో శాతం ఉన్న డార్క్ చాక్లెట్లో ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండటంతో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరంలో జరిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగు కాల్షియం, ప్రోటీన్‌కు మంచి మూలం. ఇది కండరాలు, ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగులో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేయడంలో, శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో విటమిన్ సి, ఆహారపు పీచు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్, సెలీనియం కూడా ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా దీనిని చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.