లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడంతో పాటు స్వల్ప ఘటనలతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమైంది. మధ్యాహ్నం మందకొడిగా ఉన్న పోలింగ్ మళ్లీ సాయంత్రానికి పుంజుకున్నది. పల్లె జనం ఓటేసేందుకు ఉత్సాహం చూపగా పట్టణాల్లో కాస్త మందకొడిగా సాగింది.
మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, వరంగల్ తూర్పులో రాత్రి 9 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. కాగా వరంగల్‌లో 64.08 శాతం, మహబూబాబాద్‌లో 70.68 శాతం నమోదైంది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో అందరూ భాగస్వాములు కాగా తొలి ఓటర్లతో పాటు వృద్ధులు, దివ్యాంగులు చైతన్యంతో ఓటేయడం కనిపించింది. ఈ సందర్భంగా ఓటేసిన యువత అక్కడున్న ఓటర్స్ సెల్ఫీ జోన్లో ‘ఐ కాస్ట్ మై వోట్’ అంటూ సెల్ఫీలు, ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకొని మురిసిపోయారు.
– వరంగల్, మహబూబాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ)
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక శాతం పోలింగ్ నమోదైంది. పరకాల నియోజకవర్గం రెండోస్థానంలో ఉంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, గ్రామీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పట్టణ ప్రాంతాల్లో 9గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు రావడం మొదలైంది. దీంతో మొదటి రెండు గంటల్లో 8.97 శాతం మాత్రమే నమోదైంది. 11 గంటల వరకు 24.48 శాతానికి చేరింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.23 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం 3గంటలకు 54.17 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 64.08 శాతం నమోదైంది.
సాయంత్రం 5గంటల వరకు నమోదైన పోలింగ్‌ను పరిశీలిస్తే అత్యధికంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 74.64 శాతం, పరకాలలో 70.20, పాలకుర్తిలో 68.41, వర్ధన్నపేటలో 66.43, భూపాలపల్లిలో 65, వరంగల్ తూర్పులో 59.43, వరంగల్ పశ్చిమలో 47శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో బందోబస్తును పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్‌చంద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య మానిటరింగ్ చేశారు.
పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. బందోబస్తు మధ్య ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పోలింగ్ అధికారులు, సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో మొత్తం 1809 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించగా అధికారులు వాటిని సరిచేసి పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో 55 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేసి వచ్చి ఇంటి వద్ద గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. మరిపెడ మండలం చింతగట్టు తండాలో 450 ఓట్లు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని ఓట్లు వేయకుండా ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అకడికి వెళ్లి వారిని సముదాయించారు.