కృష్ణ కాలనీ, జనవరి 4 : సీఎం రేవంత్ రెడ్డి ఓ వీధి రౌడీలా మాట్లాడుతుంటే ప్రజలు అస హ్యించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9,10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరాకుల రాజయ్యతో పాటు 600 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర, పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మార్పు కావాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్లయినా ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు.
బీఆర్ఎస్ నాయకులను బూతులు తిట్టడమే అభివృద్ధిగా భావిస్తున్నాడన్నారు. పుల్లూరురామయ్యప ల్లి ప్రజలు మా ఊరు అల్లుడని గండ్ర సత్యనారాయణరావుకు ఓటు వేసి గెలిపిస్తే, ఎమ్మెల్యే బంధువులు మాత్రం అభివృద్ధిపై ప్రశ్నిస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చితే.. భూపాలపల్లిలో ఎమ్మెల్యే కూల్చుతున్నాడన్నారు. ఇదే కాలనీకి చెందిన కూరాకుల ఓదెలు బర్లు పెంచుకొని పాలు అమ్ముకుంటూ జీవిస్తుంటే, ఓర్వలేని ఎమ్మెల్యే, అనుచరులు ఆయన ఇల్లును కూల్చివేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుల్లూరి రామయ్యపల్లి, మహబూబ్‌పల్లి కాలనీల్లో సెంట్రల్ లైటింగ్, 4లైన్ల రోడ్డు వేయించి అభివృద్ధి చేశానన్నారు. 9వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మారెట్, 10వ వార్డులో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవనాలు రెండేళ్లయినా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయకపోవడం సిగ్గు చేటన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే ఇప్పటికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని దద్దమ్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బద్ది సమ్మయ్య, ముంజంపల్లి మురళీధర్, బీఆర్ఎస్ నాయకులు సెగ్గం సిద్ధు, బీబీ చారి, పిల్లలమర్రి నారాయణ, సంకటి మొగిలి, పిల్లి వేణు, తిరుపతమ్మ, స్వప్న, బడితెల శ్రీధర్, కొమ్ము దేవేందర్, ఉసే లింగయ్య, రామారావు, బొంపెల్లి మలహల్రావు, దుగ్యాల కిషన్‌రావు, చింతనిప్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికలంటే భూపాలపల్లిలో ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెసోళ్లు భయపడుతున్నారు. నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి, కర్రు కాల్చి వాతపెట్టారు. ఇంకా ఆ భయం ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ నాయకులను వీడలేదు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గెలిచి రెండేళ్లయినా ఇప్పటి వరకు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నెరవేరని హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి.