జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చెరువు శిఖం, ప్రభుత్వ, సీలింగ్ భూములకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు శిఖం భూములను చాలా మంది రెగ్యులరైజ్ చేసుకోగా ప్రస్తుతం మళ్లీ అదే క్రమంలో అర్జీలు వచ్చాయి. ఎల్ఆర్ఎస్తో ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకునేందుకు అక్రమార్కులు స్కెచ్ వేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎల్ఆర్ఎస్కు మొత్తం 8312 దరఖాస్తులు రాగా, ప్రభుత్వ, సీలింగ్, చెరువు శిఖం భూములకు వచ్చిన 1231 అర్జీలను అధికారులు తిరస్కరించారు. అలాగే ఇరిగేషన్ శాఖ పరిశీలనలో 3279 దరఖాస్తులు ఉన్నాయి. మొత్తం 1214 దరఖాస్తులు మాత్రమే అఫ్రూవల్ కాగా, 71 మంది మాత్రమే డబ్బులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నారు. 20 20లో ఎల్ఆర్ఎస్ కింద తమ భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు 8312 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
వారికి సంబంధిత అధికారులు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని వేడుకుంటున్నా రెస్పాన్స్ రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. భూపాలపల్లి, కాటారం, గణపురం మండలాల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తూ ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు డబ్బులు చెల్లించేందుకు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదు. కాగా జిల్లాలో 60 ఇల్లీగల్ వెంచర్ల యజమాను లు ఎల్ ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని చేతులు ముడుచుకుని కూర్చున్నారు.
జిల్లాలో మొత్తం 8312 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 3771, భూపాలపల్లి మండలంలో 191, చిట్యాలలో 23, గణపురంలో 1573, కాటారంలో 2196, మహాదేవపూర్‌లో 332, మల్హర్‌లో 115, మహాముత్తారంలో 15, టేకుమట్లలో 14, రేగొండ మండలంలో 75 దరఖాస్తులు వచ్చాయి. కా గా జిల్లాలోని 10 మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలోనే ఉండ గా, కేవలం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే 1214 దరఖాస్తులు అఫ్రూవ్ అయ్యాయి.
ఎల్ఆర్ఎస్ దరఖా స్తులను పరిశీలించేందుకు మండలానికి ఒక టీంను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా డిపార్ట్మెంట్ల నుంచి నలుగురు సభ్యులు ఉంటా రు. లెవల్ 1, లెవల్ 2 వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ చేస్తారు. 3925 దరఖాస్తులు లెవల్ 1 దశలో, 1712 లెవల్ 2 దశలో ఉన్నాయి. దరఖాస్తుదారులు డాక్యుమెంట్ వ్యాల్యూపై 14 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లీగల్ ప్లాటింగ్ చేసిన వెంచర్ల యజమానులు గ్రీన్‌ల్యాండ్ చార్జెస్ 14 శాతం, డెవలప్మెంట్ చార్జీలు గజానికి రూ.100 చెల్లించాలి. 60 ఇల్లీగల్ వెంచర్ల వ్యాపారులు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాలోని చెరువు శిఖం భూములకు పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా అధికారులు పరిశీలిస్తున్నారు. భూపాలపల్లి మండలం నుంచి 3, గణపురం 71, కాటారం 194, మహదేవపూర్ 37, మల్హర్ 2, మహాముత్తారం 1, రేగొండ మండలం నుంచి ఒకటి, మున్సిపాలిటీ పరి ధిలో 922 దరఖాస్తులను ఇప్పటి వరకు అధికారులు తిరస్కరించారు. భూపాలపల్లి పట్టణంలోని తుమ్మలచెరువు, గోరంట్లకుంట శిఖం భూముల నుంచి ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు వచ్చాయి. వాటిని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.