వరంగల్, సెస్టెంబర్ 7 : గ్రేటర్ వరంగల్‌లో వర్షం దంచికొట్టింది. ఆదివారం ఉదయం రెండు గంటల పాటు కుండపోత వాన కురవగా, 5.63 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరంగల్, హనుమకొండ ప్రాంతాలు అగమాగం కాగా, జనజీవనం స్తంభించింది. అనేక కాలనీలు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది.
ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. రహదారులపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద భారీ వరద నీరు చేరుకోగా, ప్రయాణికులతో వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు అందులో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న బల్దియా డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికులు కలిసి తాళ్ల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చారు.
బస్సులను క్రేన్ల సాయంతో బయటకు లాగారు. కాగా, ప్రయాణికులను కాపాడే క్రమంలో మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్ కాలుకు తీవ్రగాయం కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే వరంగల్ చౌరస్తా, బీట్‌బజార్, స్టేషన్‌రోడ్డు, సాకారాశికుంట, పెరకవాడ, బీరన్నకుంట, లక్ష్మీనగర్, ఏకశిలానగర్, కాశీకుంట కాలనీల్లోకి వరద నీరు చేరింది. హనుమకొండ చౌరస్తా, బస్‌స్టేషన్ రోడ్డు, భవానీనగర్, ఇందిరానగర్, కాకాజీ కాలనీ, లోకల్ బస్‌స్టేషన్, అంబేద్కర్ భవన్ ప్రాంతాలు చెరువులను తలపించాయి. వరద నీటితో సుమారు రెండు, మూడు గంటలు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.