హనుమకొండ, జూలై 7 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా ఇప్పటికే అధికారులు దాదాపు 99 శాతం ఫామ్స్‌ను ఓటర్లకు పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ ముగింపు దశకు వచ్చినప్పటికీ డిజిటలైజేషన్‌పై అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం వరకు కేవలం 15.90 శాతం డిజిటలైజేషన్ మాత్రమే జరిగింది. సర్ ప్రక్రియకు మరో 16 రోజుల గడువే ఉండడంతో ఆలోపు డిజిటలైజేషన్ పూర్తవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సేకరించిన ఫామ్స్‌ను వెంటనే ఆన్లైన్ చేయకపోతే చివరి దశలో పనిభారం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నది. అయితే ఈఎఫ్‌లు నింపే విషయమై అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతోనే డిజిటలైజేషన్ ఆలస్యమవుతున్నదని కొందరు బీఎల్వోలు అంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 5,09,014 మంది ఓటర్లున్నారు. బుధవారం వరకు మొత్తం 5,08,381 మందికి ఫామ్స్ పంపిణీ చేశారు. వీటిలో కేవలం 62,720 (12.32 శాతం) ఫామ్స్‌ను మాత్రమే డిజిటలైజేషన్ చేశారు.
అలాగే మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల పరిధిలో 4,84,935 మంది ఓటర్లుండగా 4,84,140 ఈఎఫ్‌లు పంపిణీ చేశారు. ఇందులో 60,426 (12.46 శాతం) ఫామ్స్‌ను ఆన్లైన్ చేశారు. జనగామ జిల్లా పరిధిలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,67,484 మంది ఓటర్లలో 7,67,431 మందికి ఫామ్స్ పంపిణీ చేసి, ఇందులో 1,40,268 (18.27 శాతం) డిజిటలైజ్ చేశారు. వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో 7,76,953 మంది ఓటర్లుండగా వీరిలో 7,65,190 ఈఎఫ్‌లు పంపిణీ చేశారు. ఇందులో 84,686 (11.26 శాతం) ఫామ్స్‌ను డిజిటలైజ్ చేశారు.
కాగా, మిగతా నియోజకవర్గాలతో పోల్చితే గ్రేటర్ వరంగల్ పరిధిలో ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ అత్యల్పంగా జరిగింది. వరంగల్ తూర్పులో 5.25 శాతం, వరంగల్ పశ్చిమలో 6.55 శాతం ఆన్లైన్ జరుగగా, వర్ధన్నపేటలోనూ 6.83 శాతం నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లిలో 25.85, ములుగులో 24.92, స్టేషన్‌ఘన్‌పూర్ 24.73, నర్సంపేటలో 21.70 శాతం డిజిటలైజేషన్ జరిగింది. కాగా, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తికావడం విశేషం.
నర్సింహులపేట, జూలై 8 : చదువు వచ్చిన వాళ్లు, రాని వారు సైతం సర్ ఫామ్స్ ఎలా నింపాలో తెలియక తికమకపడుతున్నారు. బీఎల్వోలకు సాంకేతిక అవగాహన లేకపోవడం, 2002 నాటి ఓటరు వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహాయక కేంద్రాలు (హెల్ప్ డెస్క్‌లు) ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు ప్రజలు వెళ్లి తమ ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపించుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానిక తహసీల్దార్ రమేశ్‌బాబు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో జీపీవోలతో పాటు చదువుకున్న యువకులు, సిబ్బందితో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.