వాజేడు, జూలై 8 : స్నేహితులతో కలిసి చేసిన విహార యాత్ర విషాదంగా ముగిసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని దూలపురం అటవీప్రాంతంలో ఉన్న నిషేధిత మాసలొద్ది జల పాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై జక్కుల సతీశ్ తెలిపిన వివ రాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన వైభవ్కుమార్ (18) హైదరాబాద్లోని విజ్ఞాన జ్యోతి (వీఎన్ఆర్) ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సిద్దిపేటకు చెందిన ఆరుగురు స్నేహితులతో కలిసి వరంగల్ చేరుకొని అక్కడ వేయిస్తంభాలతోపాటు భద్రకాళీ, అనంతరం రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి వాజేడు మండలానికి చేరుకొని బొగత జలపాతాన్ని సందర్శించారు.
అనంతరం దూలపురం అడవిలోని నిషేధిత మాసలొద్ది జలపాతాన్ని సందర్శించి స్నేహితులతో సరదాగా గడుపుతున్న క్రమంలో వైభవ్కుమార్ ప్రమాదవశాత్తు లోతైన నీటి గుండంలో పడిపోయాడు. స్నేహితులెవరికీ ఈత రాకపోవడంతో డయల్ 100 ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటాపురం సీఐ ముత్యం రమేశ్, వాజేడు ఎస్సై జక్కుల సతీశ్ పోలీసు బృందంతో కలిసి ఘటనా ప్రదేశానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న వైభవ్ కుమార్ను బైక్ మీద వాజేడు పీహెచ్సీకి తరలించారు. వైద్యసిబ్బంది సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఏటూరునాగారం వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మండలంలోని కొంగాల దూసపాటిలొద్ది, దూలపురంలోని మాసలొద్ది, అరుణాచలపురం, గణపురం అటవీప్రాంతంలోని గుండం జలపాతాల సందర్శనపై నిషేధం ఉంది. వీటిని సందర్శించొద్దు. ఇక్కడ జలపాతాలకు వెళ్లకుండా అటవీ శాఖ సిబ్బంది కాపలా ఉన్నా కళ్లు గప్పి పర్యాటకులు వెళ్లి మృత్యువాత పడుతున్నారు.