హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు.. ఆంగ్ల దినపత్రిక డెకన్ క్రానికల్ యాజమాన్యానికి పరువునష్టం నోటీసు జారీ చేశారు. బుధవారం ఆ పత్రిక మొదటి పేజీలో ప్రచురితమైన ‘KTR’s Landlord Builds Tower in Hussainsagar’ అనే కథనం తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉద్దేశపూర్వకంగా రాసినదని, ఆయన తన న్యాయవాద బృందం పీవీ జనని అండ్ అసోసియేట్స్ ద్వారా పంపిన నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసును డెకన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కి ఆయన పంపారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలో ఒక ప్రైవేట్ డెవలపర్‌కు ఇచ్చిన భవన అనుమతులను జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తితో ముడిపెడుతూ ఈ కథనం తప్పుడు ఆరోపణలు చేసిందని కేటీఆర్ న్యాయవాదులు పేరొన్నారు. ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్, దాని డెవలపర్ లేదా భవన అనుమతులతో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనడం పూర్తిగా అవాస్తవమని, పాత, నిరాధారమైన ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా మళ్లీ తెరపైకి తెచ్చారని ఖండించారు. కనీస ఆధారాలు లేకుండా కేవలం ఆయన ప్రతిష్ఠ, విశ్వసనీయతను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ ఫేక్‌న్యూస్ ప్రచురించారని లీగల్ నోటీసులో పేరొన్నారు. కనీస జర్నలిస్టు విలువలు పాటించకుండా, కేటీఆర్ వివరణ కోరకుండా చేసిన ఈ తప్పుకుగాను క్షమాపణ చెప్పేందుకు పబ్లిషర్‌కు 48 గంటల గడువు విధించారు. ఈ గడువులోగా సదరు పరువునష్టం కలిగించే కథనాన్ని, దానికి సంబంధించిన డిజిటల్ లింక్‌లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, జరిగిన నష్టానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించకూడదని స్పష్టంచేశారు. ఈ షరతులను 48 గంటల్లోగా పాటించకపోతే, డెకన్ క్రానికల్ యాజమాన్యంపై తగిన సివిల్, క్రిమినల్, నష్టపరిహారం దావాలను వేస్తామని ఈ మేరకు న్యాయవాదులు హెచ్చరించారు.