మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jan 02, 2021 , 02:00:19

వరంగల్‌-విజయవాడమూడో రైల్‌వే..

వరంగల్‌-విజయవాడమూడో రైల్‌వే..

  • లైన్‌కు భూ సేకరణ ముమ్మరం
  • రంగంలోకి రెవెన్యూ అధికారులు
  • గ్రామం వారీగా భూముల గుర్తింపు
  • సేకరించాల్సింది 104ఎకరాలు   
  • రేటు నిర్ణయంపై రైతులతో చర్చలు
  • ఇప్పటికే రెండు గ్రామాల్లో పరిహారం

వరంగల్‌రూరల్‌, జనవరి 1 (నమస్తేతెలంగాణ):వరంగల్‌- విజయవాడ మార్గంలో రైల్వే మూడో లైన్‌ నిర్మాణానికి అధికారులు భూసేకరణ చేపట్టారు. సేకరించాల్సిన భూములను గుర్తించారు. భూములు కోల్పోయే రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేటు నిర్ణయంపై చర్చిస్తున్నారు. రైతుల అంగీకారంతో భూములను సేకరించే పనిలో తలమునకలయ్యారు. రైల్వే మూడో లైన్‌ నిర్మాణం కోసం రైల్వే శాఖ అధికారులు సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వరంగల్‌రూరల్‌ జిల్లాలో 13 మండలాల్లోని 11 గ్రామాల్లో 104.13 ఎకరాల భూమిని రైల్వే మూడో లైన్‌ కోసం సేకరించాల్సి ఉంది. ఈ మేరకు రెవెన్యూశాఖ అధికారులు సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట, సంగెం, చింతలపల్లి గ్రామాల్లో 20.03 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. గీసుగొండ మండలంలోని శాయంపేట హవేలి, వంచనగిరి, ధర్మారం గ్రామాల్లో 20.35 ఎకరాల భూసేకరణకు ప్లాన్‌ చేశారు. నెక్కొండ మండలంలో గుండ్రాతిపల్లి, పెద్దకొర్పోలు, అప్పల్‌రావుపేట, నెక్కొండ, చంద్రుగొండ గ్రామాల్లో 63.15 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని ప్రకటించారు. కాగా, గుండ్రాతిపల్లిలో 4.05, పెద్దకొర్పోలులో 11.01, అప్పల్‌రావుపేటలో 6.35 ఎకరాలు, నెక్కొండలో 4453.50 మీటర్లు, చంద్రుగొండలో 265.32 మీటర్ల భూమిని సేకరించే పనులను కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు.  భూములు కోల్పోయే రైతులతో సమావేశమై రేటు నిర్ణయంపై చర్చిస్తున్నారు.

సంగెంలో పరిహారం చెల్లింపు

సంగెం, గీసుగొండ మండలాల్లో రైల్వే మూడో లైన్‌ కోసం చేపట్టిన భూసేకరణ ఊపందుకుంది. సంగెం లో 2.22 ఎకరాలు, చింతలపల్లిలో 3.08 ఎకరాలు కోల్పోతున్న రైతులకు డబ్బులు చెల్లించారు. సంగెం రైతులకు ఎకరానికి రూ.18 లక్షలు, చింతలపల్లి రైతులకు ఎకరానికి రూ.11.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ఎల్గూరిరంగంపేటలో 14.12 ఎకరాల భూమిని సేకరించేందుకు ఎకరానికి రూ.11.95 లక్ష ల చొప్పున పరిహారం చెల్లించేలా రేటు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. గీసుగొండ మండలంలోని శాయంపేటహవేలిలో11.14 ఎకరాలు,వంచనగిరిలో 3.39, ధర్మారంలో 5.21 ఎకరాల భూమి సేకరణకు రైతులతో అధికారులు సమావేశమయ్యారు. మూడు గ్రా మాల్లో ధర విషయమై ఇంకా తుది నిర్ణయం జరగలే దు. ఈ గ్రామాల్లో ఎకరానికి రూ.30 లక్షల రేటు ఉన్న ట్లు రైతులు చెబుతున్నారు. భూసేకరణ చట్టం ప్రకా రం శాయంపేటహావేలిలో రూ.19లక్షలకుపైగా, వంచనగిరిలో రూ.20.50 లక్షలు ఉన్నట్లు తెలిసింది.

రైతులతో మాట్లాడిన కలెక్టర్‌

రేటు నిర్ణయంపై డిసెంబర్‌ 28న కలెక్టర్‌ హరిత తన కార్యాలయంలో శాయంపేటహవేలి, వంచనగిరి గ్రామాల రైతులతో సమావేశమ య్యా రు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని, అన్యా యం జరుగకుండా చూస్తానని  కలెక్టర్‌   రైతులకు చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి, వరంగల్‌రూరల్‌ ఆర్డీవో మహేందర్‌జీ సమావేశంలో పాల్గొన్నారు. కొద్ది రోజుల్లో  స్పష్టత వచ్చే అవకాశం ఉంది.    logo