సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Oct 06, 2020 , 04:06:43

‘ప్రగతి’పై విజి‘లెన్స్‌'

‘ప్రగతి’పై విజి‘లెన్స్‌'

  • గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నిఘా బృందాలు
  • గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’పై క్షేత్రస్థాయి పరిశీలన
  • పారిశుధ్య నిర్వహణపై ఫొటోల చిత్రీకరణ
  • యాప్‌లో అప్‌లోడ్‌.. నిర్లక్ష్యంపై సీరియస్‌
  • బాధ్యులైన సర్పంచ్‌లు, కార్యదర్శులపై వేటు
  • వారంలోనే ఐదుగురి సస్పెన్షన్‌.. పంచాయతీల్లో అలర్ట్‌ 

గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయిస్తూ పారిశుధ్య నిర్వహణను పరిశీలిస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమాల అమలులో సర్పంచ్‌లుగానీ, కార్యదర్శులు గానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే వరంగల్‌రూరల్‌ జిల్లాలో ముగ్గురు సర్పంచ్‌లు, ఇద్దరు కార్యదర్శులపై వేటు పడింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఐదుగురు సస్పెన్షన్‌కు గురికావడం పంచాయతీల్లో కలకలం రేపింది. 

- వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

వరంగల్‌రూరల్‌, నమస్తే తెలంగాణ : పల్లెల్లో పారిశుధ్యంపై సర్కారు నజర్‌ పెట్టింది. ఈ మేరకు కలెక్టర్‌, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆకస్మికంగా తనిఖీలు చేయిస్తున్నది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పారిశుధ్యా న్ని పరిశీలిస్తున్న అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్‌లు, కార్యదర్శులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్‌రూరల్‌ జిల్లాలో ముగ్గురు సర్పంచ్‌లు, ఇద్దరు కార్యదర్శులపై వేటు పడడం, వారం వ్యవధిలోనే ఐదుగురు సస్పెన్షన్‌కు గురికావడంతో అన్ని గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు అలర్ట్‌ అయ్యారు. పల్లెల ప్రగతి లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2019 సెప్టెంబర్‌ నుంచి ప్రభుత్వం పల్లె ప్రగతిని అమల్లోకి తెచ్చింది. పరిశుభ్రత, పచ్చదనం టార్గెట్‌గా ఊరూరా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ప్రకటించింది. ‘ప్రగతి’ పనుల కో సం ప్రతి పంచాయతీకి నెలనెలా నిధులు కేటాయిస్తున్నది. పారిశుధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్‌ లేదా మినీ ట్రాక్టర్‌, ట్రాలీ ఆటోలను సమకూర్చింది. సిబ్బంది కొరత ఉన్న జీపీల్లో నియామకాలు చేపట్టింది. చెత్త సేకరణ కోసం ఇంటింటికీ డస్ట్‌బిన్లను అందజేసింది. గ్రామంలో సేకరించిన చెత్తను డంప్‌ చేసేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో యార్డుల నిర్మాణం చేపట్టింది. గ్రామాల్లో రోడ్లపైగానీ, మురుగుకాల్వల్లో గానీ చెత్త, పెంట వేసిన, పరిసరాల అపరిశుభ్రతకు కారకులైన వారికి సర్పంచ్‌, కార్యదర్శి, ఇతర అధికారులు జరిమానా విధిస్తున్నారు.

నిఘా విభాగాల పరిశీలన

పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలను ఏర్పాటు చేసింది. వీటిలో విజిలెన్స్‌ విభాగం గత జూన్‌ ఒకటి, క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఆగస్టు నుంచి రంగంలోకి దిగినట్లు తెలిసింది. జిల్లా గ్రామీణాభివృద్ధ్దిశాఖ నుంచి ఈ విభాగాలు పనిచేస్తున్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగా ల అధికారులు గ్రామాలను సందర్శిస్తున్నారు. ఏ గ్రామాన్ని విజిట్‌ చేయాలనేది ఒకరోజు ముందు కమిషనర్‌ ఆఫీసు నుంచి ఈ విభాగాల జిల్లా అధికారులకు సమాచారం అందుతుంది. ఈ మేరకు తెల్లవారి సదరు గ్రామాలకు విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు చేరుకుని పారిశుధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎనిమిది అంశాలపై ఫొటోలు తీసి పల్లె ప్రగతి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ ఆవరణ, పీహెచ్‌సీ, రేషన్‌ షాపు, మార్కెట్‌ యార్డు, డంపింగ్‌ యార్డు ఉంటున్నాయి. వీటితో సహా ఇం టింటి నుంచి చెత్త సేకరణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, బ్లీచింగ్‌ పౌడర్‌, స్ప్రే చేయడం తదితర 25అంశాలపై విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాల అధికారులు ఆయా గ్రా మంలోని ఐదుగురు సీనియర్‌ సిటిజన్స్‌తో మాట్లాడుతున్నారు. పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శి, సిబ్బంది పనితీరు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఎనిమిది అంశాలపై యా ప్‌లో ఈ నిఘా విభాగాల అధికారులు ఎనిమిది అంశాలపై అప్‌లోడ్‌ చేసిన లైవ్‌ ఫొటోలను కమిషనర్‌ కార్యాలయ అధికారులు చూసి ఆయా పంచాయతీలకు రేటింగ్‌ ఇస్తున్నారు. పారిశుధ్యం నిర్వహణ సరిగా లేదని తేలితే బాధ్యులైన సర్పం చ్‌, కార్యదర్శులపై వేటుకు కమిషనర్‌ సిఫారసు చేస్తున్నారు.  

పల్లెల్లో సస్పెన్షన్ల పర్వం

నెక్కొండ మండలంలోని బొల్లికొండ పంచాయతీ సర్పంచ్‌ బానోతు శ్రీధర్‌ను సస్పెండ్‌ చేస్తూ గత సెప్టెంబరు 26న రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుధ్యం, పల్లె ప్రగతి పనుల నిర్వహణలో అలసత్వం వహించినందుకు సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా గాంధీ జయంతి రోజైన శుక్రవారం రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులపై ఆమె సస్పెన్షన్‌ వేటు వేశారు. రాయపర్తి మండలంలోని కిష్టాపూర్‌ సర్పంచ్‌ సంకినేని ఉప్పలమ్మ, కార్యదర్శి భూక్య దేవేందర్‌, దుగ్గొండి మండలంలోని వెంకటాపురం పంచాయతీ సర్పంచ్‌ ఐ రాజేశ్వర్‌రావు, కార్యదర్శి వీ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. గ్రామ పారిశుధ్యం, పల్లె ప్రగతి పనుల నిర్వహణలో అలసత్వం వహించినందుకు సర్పంచ్‌లు, కార్యదర్శులను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు.

వీటిలో బొల్లికొండ, వెంకటాపురం గ్రామాలను కొద్ది రో జుల క్రితం విజిలెన్స్‌ జిల్లా అధికారి పద్మనాభరెడ్డి బృందం సందర్శించింది. గ్రామంలో పారిశుధ్యం లోపించిందని, రహదారులపై చెత్త పేరుకపోయిందని, డ్రైనేజీలు శుభ్రంగా లేవని, గుంతల్లో నీరు నిలిచి ఉందని, పంచాయతీ సిబ్బం ది పనితీరు సంతృప్తికరంగా లేదని తేలినట్లు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయ ఆదేశాలతో బొల్లికొండ, వెంకటాపురం సర్పంచ్‌లు, వెంకటాపురం కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు తెలిసింది. రూరల్‌ జిల్లాలో 401 పంచాయతీలుంటే విజిలెన్స్‌ బృందం ఇప్పటికే 101 పంచాయతీలను సందర్శించినట్లు సమాచారం. క్వాలిటీ కంట్రోల్‌ టీం కూ డా కొన్ని పంచాయతీలను విజిట్‌ చేసినట్లు తెలిసింది.

కలెక్టర్‌ హరిత గత సెప్టెంబరు 27న కిష్టాపూర్‌ను సందర్శించారు. ఇక్కడ రోడ్లపై చెత్త, పెంట కుప్పలు, రహదారుల పక్కన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండడంతో పారిశుధ్య నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్‌ ఉప్పలమ్మ స్థానంలో ఆమె కొడుకు పాలనలో జోక్యం చే సుకోవడాన్ని తప్పుబట్టారు. ఆమె పర్యటన అనంతరం కిష్టాపూర్‌ సర్పంచ్‌, కార్యదర్శిపై వేటు పడింది. నల్లబెల్లి మండలంలోని నారక్కపేట సర్పంచ్‌కు బదులు ఆమె కొడుకు పాలనలో జోక్యం చేసుకోవడంపై కొద్ది రోజుల క్రితం పంచాయతీ అధికారి సదరు సర్పంచ్‌కు నోటీసు జారీ చేశారు. ఇలాంటి వరుస ఘటనలు అన్ని పంచాయతీల్లో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.