అధికారుల ప్రణాళికా లోపం.. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం భద్రకాళీ చెరువుకు శాపంగా మారింది. సుందరీకరణ పేరిట నీళ్లు ఖాళీ చేసి నాలుగు నెలలైంది. పూడికతీతకు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది. తాజాగా 1.41 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వుకునేందుకు ఒప్పందం కుదిరింది. పనులు మొదలైనప్పటికీ మిగిలిన 93 శాతం పూడికతీతపై సందిగ్ధత నెలకొంది. ఏంచేయాలో పాలుపోక అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. మరో రెండున్నర నెలల్లో వానకాలం ప్రారంభం కానుంది. ఆలోగా పూడికతీతతోపాటు సుందరీకరణ పూర్తి చేయాల్సి ఉంది. హడావుడిగా నీళ్లు బయటకు వదిలిన అధికారులు ఇప్పుడు అంతే వేగంగా పనులు జరగకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. గడువులోగా పనులు ఎలా పూర్తి చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
– వరంగల్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సర్కారు ఆదేశాల మేరకు సాగునీటి శాఖ అధికారులు గత ఏడాది నవంబరు 8న చెరువును మొత్తం ఖాళీ చేశారు. 20 రోజుల్లో చెరువులోని నీళ్లన్నీ దిగువన ఉన్న నాగారం చెరువులోకి వెళ్లాయి. ఇది పూర్తయి నాలుగు నెలలైనా అభివృద్ధి పనులు మాత్రం ఇంకా మొదలుకాలేదు. ఎప్పటికి ప్రారంభమవుతాయనే విషయంలోనూ స్పష్టత లేదు. భద్రకాళీ చెరువులోని నీళ్లు ఖాళీ చేయడంతో దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఎండల తీవ్రతకు నీటి కొరత మొదలవుతున్నది. భద్రకాళీ చెరువులో నీటిని కిందికి వదలడంతో చేపల వృత్తిపై ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలు నష్టపోయాయి. వానకాలంలోపు చెరువును నింపకపోతే వచ్చే ఏడాది చేపల పెంపకం ఉండక మరో ఏడాది కూడా నష్టపోవాల్సి వస్తుందని ఆ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చారిత్రక భద్రకాళీ చెరువు అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలు, వాస్తవ పనులు పరస్పరం విరుద్ధంగా కనిపిస్తున్నాయి. వానకాలంలోపు భద్రకాళీ చెరువు సుందరీకరణ పూర్తవుతుందని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రణాళిక లేమి కారణంగా పనుల పూర్తిపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకు భద్రకాళీ చెరువులోని మొత్తం నీటిని కిందికి వదిలిన అధికారులకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఇప్పటికిప్పుడు ఏం చేసినా, ఎంత చేసినా వానకాలంలోపు పనులు పూర్తయ్యే పరిస్థితి లేదని జిల్లా ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు. భద్రకాళీ చెరువు పూడికతీతకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
భద్రకాళీ చెరువులో 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఉన్నట్లుగా సాగునీటి శాఖ అధికారులు నిర్ధారించారు. క్యూబిక్ మీటర్ మట్టికి మొదట్లో రూ. 162 చొప్పున ధర నిర్ణయించారు. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. చివరికి క్యూబిక్ మీటరుకు రూ. 71 చొప్పున చెల్లించి ఇష్టం వచ్చిన వారు మట్టి తీసుకుపోవచ్చని ప్రకటించారు. అధికారుల బలవంతం మీద 1.41 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకునేందుకు కొందరు ముందుకు వచ్చారు. ఈ మేరకు సాగునీటి శాఖకు డీడీలు చెల్లించారు. చెరువులోని మిగిలిన మట్టి తరలింపు ఎలా అనేది స్పష్టత రావడంలేదు. మరో రెండున్నర నెలల్లో వానకాలం మొదలుకానుండగా, ఆలోగా పూడికతీత సగం కూడా అయ్యే పరిస్థితి కనిపించడంలేదు.
భద్రకాళీ చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. చెరువు మొత్తాన్ని సాగునీటి శాఖ అధికారులు ఐదు బ్లాకులుగా విభజించారు. మొదటి మూడు బ్లాకుల్లోని 6.50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తవ్వకాల కోసం టెండర్లు పిలిచారు. మొదట్లో క్యూబిక్ మీటరు మట్టికి రూ. 250 చొప్పున ధర నిర్ణయించగా, స్పందన లేకపోవడంతో రూ.162.56కు తగ్గించి టెండర్లు పిలిచారు.
మట్టి తవ్వకాలతో రూ.9.50 కోట్లు ఆదాయం వస్తుందని సాగునీటి శాఖ అధికారులు అంచనా వేసినప్పటికీ అవి తలకిందులయ్యాయి. రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తాజాగా క్యూబిక్ మీటర్ మట్టి తవ్వుకునేందుకు రూ. 71గా నిర్ణయించారు. దీంతో 1.41 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వుకునేందుకు కొందరు ముందుకు రాగా, పనులు ప్రారంభమయ్యాయి. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సాగునీటి శాఖ అధికారుల ప్రణాళికా లోపమే భద్రకాళీ చెరువు పనులకు శాపంగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.