అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క హామీనీ సక్రమంగా అమలుచేయని రేవంత్ సర్కారు.. రైతుభరోసా విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఆలస్యంగా పెట్టుబడి సాయం పంపిణీ మొదలుకాగా అందులోనూ కోతలు విధించడం, మరికొందరికి అసలే జమచేయకుండా మోసం చేస్తున్నది. గతం కంటే ఎక్కువ(రూ.7500) ఇస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు కనీసం రూ.6 వేలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతున్నది. దేవరుప్పుల మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన పేరువరి భిక్షపతికి 1.35 ఎకరాల భూముండగా అతడి ఖాతాలో రూ.5,250 జమకావాల్సి ఉంది.
అయితే రూ. 2,100 పడినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అలాగే హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లికి చెందిన వరికెల కిషన్‌రావుకు 2.26 ఎకరాల భూముండగా, ఆయనకు కేవలం 6 గుంటలకు రూ. 900 మాత్రమే ఖాతాలో జమయ్యాయి. ఇలా ఉన్న భూమికి, జమవుతున్న డబ్బులకు పొంతన లేకపోవడంతో ఉమ్మడి జిల్లా అంతటా ఇదే గందరగోళం నెలకొంది. దీంతో ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను చూపించేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయాలకు, బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అధికారులు సైతం తమకే తెలియదంటూ దాటవేయడంతో ఏం చేయాలో అర్థంగాక దిగాలు చెందుతున్నారు.
– పరకాల/దేవరుప్పుల/ఖానాపురం/ పెద్దవంగర/ నర్సింహులపేట, ఫిబ్రవరి 14
రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 ఇస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చా క ఆ ఊసే ఎత్తలేదు. ఎట్టకేలకు 14 నెలల తర్వాత ఎకరాకు రూ.6వేలే ఇస్తామని రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించి మరో మోసానికి తెరలేపారు. ఇప్పుడు అందులో కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం 2 ఎకరాల నుంచి 3 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులను సర్కారు జమచేస్తున్నప్పటికీ చాలామంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాకపోగా, మరికొందరికి భారీ కోతలు పెడుతున్నారు. ఉదాహరణకు 3 ఎకరాలు కలిగిన రైతుకు రూ.18వేలు జమకావాల్సి ఉన్నప్పటికీ రూ.10 నుంచి రూ.12వేలకు మించి జమ కావడంలేదు. ఎకరాకు రూ.4 నుంచి రూ.5వేలకు లోపే జమ అవుతున్నాయి. ఇలా ఎకరం నుంచి 3 ఎకరాలు కలిగిన రైతులందరికీ అన్యాయం జరుగుతున్నది.
నాకు 1.25 ఎకరాల భూమి ఉంది. కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం పెట్టుబడి సా యం అందిస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా రూ.2,250 వచ్చింది. మా కుటుంబ సభ్యులకు సైతం అలానే డబ్బులు పడ్డయి. వ్యవసాయ అధికారులను అడిగితే ఏమి తెల్వదంటున్నరు. వ్యవసాయానికి యోగ్యంకాని భూమి కూడా లేదని, మొత్తానికి పడాలె కానీ ఎందుకు రాలేదో సమాచారం లేదంటున్నరు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలా నష్టమే.
– వేముల లక్ష్మణ్, ఉప్పరగూడెం గ్రామం, పెద్దవంగర మండలం
నాకు రెండెకరాల 16 గుంటల భూమి ఉంటే 11 గుంటలకు రూ.1650 పడ్డయ్. ఇదేందని ఏవోను అడిగితే మాకు తెలువదంటున్నడు. రుణమాఫీ కాలే. నెల రోజులు ఎండబోసి వడ్లు అమ్మితే బోనస్ రాలేదు. సీఎం రేవంత్ చెప్పేదొకటి.. చేసేదొకటి.. రైతులను నిండా ముంచుతున్నాడు. రైతులను పట్టించుకునే వారు లేరు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు బ్యాంకోల్లు పిలిచి పైసలు ఇచ్చిన్రు. కాంగ్రెసోళ్లు గెలిచినకాన్నుంచి రైతులను గోస పుచ్చుకుంటున్నారు. మా రైతులను గిట్ల గోసపెడితే ఎట్లా.
– చిమ్ముల యాకమ్మ, మహిళా రైతు, పడమటిగూడెం, నర్సింహులపేట
కేసీఆర్ పాలనలోనే రైతులు సంతోషంగా ఉన్నరు. రైతుబంధు ప్రారంభించిన తర్వాత ఏడాదికి రెండు సార్లు రైతుల ఖాతాల్లో జమయ్యేవి. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగును ప్రారంభించేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వానకాలం పంటకు రైతు భరోసా ఎగ్గొట్టింది. ఇప్పుడు సగం పంటకాలం పూర్తయిన తర్వాత అరకొరగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో భూమి వివరాలున్నా ఎందుకు తక్కువగా డబ్బులు వేస్తున్నారో తెల్వడం లేదు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారే తన వద్ద పూర్తి స్థాయి సమాచారం లేదంటే ఇంకెవల దగ్గర ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లా పాత రోజులు గుర్తుకు వస్తున్నయ్. కేసీఆర్ పాలనే బాగుండేది.
– వరికెల కిషన్‌రావు, నర్సక్కపల్లి, నడికూడ మండలం
చాలాచోట్ల సర్వే నంబర్లలో బై నంబర్లు ఉన్న వారికి రైతుభరోసా అందడం లేదు. రెండు, మూడు సర్వేనంబర్లలో ఉంటే ఒకటి, రెండు స ర్వే నంబర్లకే జమ అవుతున్నట్లు రైతులు గుర్తించారు. నర్సింహులపేట మండలంలో బై నంబర్లకు రైతుభరోసా రాలేదని రైతులు అడిగితే ‘మాకు తెలువదు? మీ నంబర్లు రెవెన్యూ అధికారులు హోల్డులో పెట్టారు?’ అని ఏవో.. ‘మాకు సంబంధం లేదు? మేము పైసలు ఇచ్చేవాళ్లం కాదు? కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి’ అని తహసీల్దార్ దాటవేయడంపై రైతులు భగ్గుమంటున్నారు.
అలాగే ఖానాపురం మండలం ఐనపల్లికి చెందిన రైతు సురేశ్‌కు గ్రామ శివారు లో 1.15 గుంటల భూమి 3 సర్వే నంబర్లలో ఉంది. ఈ రైతుకు రూ.8250 జమ కావాల్సి ఉంది. కానీ కేవలం ఒక్క సర్వేనంబర్కే రూ.4, 950 జమ అయ్యాయి. అలాగే అదే గ్రామంలో మరో రైతు భిక్షపతికి 1.20 భూమికి గాను రూ.9వేలు జమకావాల్సి ఉండగా కేవలం ఎక రం భూమికి రూ.6వేలు మాత్రమే పడ్డాయి. ఇలా ఎంతోమంది రైతులకు అసంపూర్తిగా రైతుభరోసా నిధులు జమ అవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.17,500 బాకీ ఉండగా కేవలం రూ.6వేలు మాత్రమే జమచేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని అందులోనూ కోతలు పెడతారా అని బాధిత రైతులు శాపనార్థాలు పెడుతున్నారు.