హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ) : స్కూళ్లకు హోలీ పండుగ సెలవుపై నెలకొన్న గందరగోళానికి విద్యాశాఖ ఎట్టకేలకు తెరదించింది. మంగళవారమే హోలీ సెలవుదినంగా ప్రకటించింది. విద్యాశాఖ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్లో మార్చి 4న హోలీ పండుగ సెలవుగా ప్రకటించారు. అయితే ప్ర భుత్వం మార్చి 3న సెలవుగా ప్రకటించింది. అకాడమిక్ క్యాలెండర్లో ఒకలా.. సర్కార్ సెలవుల జాబితా మరోలా ఉండటం గందరగోళానికి దారితీసింది. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పందించి మార్చి 3న సెలవు ప్రకటించారు.
రంజాన్, శ్రీరామనవమి కూడా..
రంజాన్, శ్రీరామనవమి సెలవులపైనా సందిగ్ధం నెలకొనగా.. దీనిపైనా నవీన్ నికోలస్ స్పష్టత ఇచ్చారు. ఈ రెండు పండుగలకు కూడా ప్రభుత్వం ప్రకటించిన సెలవులనే అనుసరించాలని ఆదేశించారు. అకాడమిక్ క్యాలెండర్లో మార్చి 20న రంజాన్, 26న శ్రీరామనవమి సెలవులుగా ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లో మార్చి 21న రంజాన్, 22న రంజాన్ తదుపరి రోజు, మార్చి 27 శ్రీరామనవమి సెలవులుగా ప్రకటించారు. గందరగోళం నెలకొనడంతో 21న రంజాన్, 27న శ్రీరామనవమి సందర్భంగా బడులకు సెలవులుగా ప్రకటించారు.