సమైక్య పాలనలో ఇరుకుగదులు, అరకొర సౌకర్యాలతో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలతో జీపీ సిబ్బంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. 1990 కాలంనాటి బయ్యారం గ్రామ పంచాయతీదీ ఇదే దుస్థితి. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత పల్లె పాలనలో కీలక భూమిక పోషించే సచివాలయ భవనాలకు మహర్దశ వచ్చింది. ‘గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి’ అనే సంకల్పంతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో బయ్యారం పాత జీపీ ఆధునీకరణకు 2017లో రూ.16లక్షలు మంజూరయ్యాయి.
ఈ నిధులతో విశాలమైన స్థలంలో మేజర్ గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. అందులో సర్పంచ్, కార్యదర్శితో పాటు సిబ్బంది కోసం వేర్వేరు గదులు ఏర్పాటుచేశారు. పనుల నిమిత్తం వచ్చే ప్రజలు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలు విన్నవించుకొని పరిష్కారం పొందుతున్నారు.
– బయ్యారం, మే 22