వైకల్యంతో బాధపడుతూ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న దివ్యాంగులకు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. రాష్ట్రం రాక ముందు రూ.500 ఉన్న పింఛన్‌ను క్రమక్రమంగా రూ.3016కు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ దివ్యాంగులకు మరో రూ.వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇందుకనుగుణంగా సీఎం ఆదేశాలు అమల్లోకి రావడంతో ఈ నెల నుంచి రూ.4016 పింఛన్ అందుతున్నది. జిల్లాలోని 12 మండలాల్లో దివ్యాంగులు 11,056 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.3.33 కోట్లు పింఛన్ వస్తున్నది. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ దివ్యాంగులు కుటుంబానికి భారం కాకుండా, వారు గౌరవప్రదంగా జీవించేలా పెన్షన్ పెంచడంతో లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-జనగామ, ఆగస్టు 25(నమస్తేతెలంగాణ)
జనగామ, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న తెలంగాణ సర్కారు దివ్యాంగులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకుంది. దివ్యాంగుల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాన్ని అమలు చేశారు. వైకల్యంతో బాధపడుతున్న వారు ఎవరికీ భారం కాకూడదనే సదుద్దేశంతో పింఛన్‌ను పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.500 ఉన్న పింఛన్‌ను రాష్ట్ర అవతరణ అనంతరం రూ.1500కు పెంచారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక డబుల్ చేశారు. గత నెల వరకూ నెలకు రూ.3.016 చొప్పన వస్తున్న పెన్షన్‌కు అదనంగా రూ.1000 పెంచారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని కార్యరూపంలో తెచ్చారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో ఈ నెల నుంచి దివ్యాంగులు రూ.4,016 చొప్పున పెన్షన్ అందుకుంటున్నారు. పింఛన్ పెంపుదలతో తమకు తమ కుటుంబాలకు మరింత ఆసరా అవుతున్నదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 11,056 మంది దివ్యాంగులుండగా, గత నెల వరకు రూ.3,016 చొప్పున రూ.3 కోట్ల 33 లక్షల 44 వేల 896 అందాయి. ఈ నెల నుంచి పెరిగిన రూ.1,000తో వారికి అందించే మొత్తం రూ.4 కోట్ల 44 లక్షల 896 కు చేరింది. ఈలెక్కన రూ.వెయ్యి పెంపుదలతో జిల్లాకు మునుపటి కంటే అదనంగా నెలకు రూ.1.10 కోట్లు దివ్యాంగులకు అందుతున్నది. ఇచ్చిన మాట సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవడంతో కేసీఆర్ సర్కారుకు దివ్యాంగులు జేజేలు పలుకుతున్నారు. మొన్నటికి మొన్న వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా జిల్లాలో కొత్తగా 14,951 మందికి ప్రయోజనం చేకూరుతున్నది. ఇప్పటికే 65,159 మందికి ప్రతినెలా రూ.15.56 కోట్లు అందుతున్నాయి. వయసు తగ్గించడంతో మరో 14,951మందికి అదనంగా పింఛన్ అందుతుండడంతో జిల్లాలో మొత్తం ఆసరా పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 80,110కి పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు డబుల్ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వృద్ధాప్య పింఛన్‌దారుల వయసును 65 నుంచి 57కు తగ్గిస్తానని, వికలాంగుల పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చారు. 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు జిల్లా వ్యాప్తంగా 14,951 మంది ఉండగా వీరికి మేలు జరిగింది.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో వివిధ రకాల ఆసరా పింఛన్ల కింద మొత్తం లక్షా 41 వేల 213 మందికి రూ.వెయ్యి 922 కోట్ల 22 లక్షలు అందాయి. ప్రస్తుతం 65,159 మందికి ఆసరా పథకంలో ప్రతినెలా పింఛన్లు అందుతున్నాయి. వీరిలో 22,306 మంది వృద్ధులు, 1,466 మంది చేనేత కార్మికులు, 10,414 మంది దివ్యాంగులు, 23,824మంది వితంతువులు, 2,008 మంది బీడీ కార్మికులు, 2,738 మంది కల్లుగీత కార్మికులుఐ, 1,485 మంది ఒంటరి మహిళలు, 404 మంది ఆర్ట్/ఏడ్స్, 514 మంది ఫైలేరియా పింఛనుదారులు ఉన్నారు. వీరందరికీ ప్రతినెలా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా లేదా పోస్టాపీస్ అకౌంట్లో డబ్బులు జమవుతున్నాయి. గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్లు రెట్టింపు చేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు అందజేస్తున్న రూ.1,500ను రూ. 3,016, మిగతా వర్గాలకు ఇస్తున్న రూ.1,000 ని రూ. 2,016కు పెంచారు. తాజాగా దివ్యాంగులకు మరో వెయ్యి అంటే రూ.4,016 చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 11,056 మంది దివ్యాంగులు ప్రస్తుతం నెలకు రూ.3,016 చూప్పున రూ.3 కోట్ల 33 లక్షల 44వేల 896 రూపాయలు అందుతుండగా ఈనెల నుంచి పెరిగిన రూ.1,000తో వారికి అందించే మొత్తం 4కోట్ల 44 లక్షల 896 రూపాయలు చేరింది. రూ.వెయ్యి పెంపుదల నిర్ణయంతో ఒక్క జనగామ జిల్లాకే ప్రభుత్వంపై మునుపటి కంటే అదనంగా నెలకు రూ.1.10 కోట్ల ఆర్థిక భారం పడింది. ఈ నేపథ్యంలో పింఛన్‌దారులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దేవరుప్పుల : మా బాధలు గమనించిన నేత సీఎం కేసీఆర్ సార్. సమాజం దివ్యాంగులను చిన్న చూపు చూసినా మాకు సార్ భరోసా కల్పించారు. సగటు మనిషి బతికేలా మాకు పింఛన్ పెంచారు. నెలకాగానే ఠంఛన్‌గా డబ్బులు వస్తుండంతో ఎవరికీ ఎదురుచూడకుండా తలెత్తుకుని బతుకుతున్నాం. మా జీవితాలు తెలిసిన ప్రభుత్వమిది. పెరిగిన పింఛన్‌తో సమాజంలో గౌరవప్రద జీవనం గడుపుతున్నాం. ఇంతకన్నా మాకెంకావాలి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మమ్ములను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటాం.
– జూకంటి రేణుక, దయన్న దివ్యాంగుల సేవాసమితి మండల అధ్యక్షురాలు, దేవరుప్పుల
బచ్చన్నపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాలో గుండె ధైర్యం నింపారు. తెలంగాణ రాక ముందు రూ.500 ఉన్న పింఛన్‌ను రాష్ట్రం వచ్చాక క్రమక్రమంగా పెంచారు. ఇప్పుడు రూ.4,016 ఇస్తున్నరు. ప్రతి నెలా పింఛన్ సక్రమంగా వస్తున్నది. మా క్షేమం కోరే కేసీఆర్ సార్ నిండు నూరేళ్లు సల్లగా ఉండాలె. ఇంత మంచి సర్కార్‌ను నేనెప్పుడూ చూడలే. మాకు గృహలక్ష్మి పథకంలోనూ రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు కేసీఆర్ సార్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సార్నే గెలిపిస్తం.
-ఇజ్జగిరి రేణుక, బండనాగారం, బచ్చన్నపేట మండలం