హనుమకొండ, జూలై 6 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు ధ్రువీకరించి ఎన్యుమరేషన్ ఫామ్‌లు అం దించాల్సి ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో అలా జరగడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఒకే చోట కూర్చొని ఓటర్లకు ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు ఓటర్లను తమ వద్దకు రావాలని సూచిస్తుండగా, మరికొందరు కేవలం ఫోన్ ద్వారానే సమాచారం సేకరిస్తున్నారు.
దీంతో ఎన్నికల సంఘం లక్ష్యం నీరుగారుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్వోలుగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను నియమించినప్పటికీ కొందరికి ఎన్యుమరేషన్‌పై పూర్తి అవగాహన లేకపోవడం, వారికి కేటాయించిన ఇండ్లు ఎక్కడ ఉన్నాయో దొరకకపోవడంతో తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడో ఒకచోట కూర్చొని ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎన్యుమరేషన్ ఫామ్‌లో తమ వివరాలు నింపి ఇవ్వకపోతే ఓటు పోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫామ్‌లు అందక కొందరు భయపడుతుంటే.. అందిన వారు మాత్రం దానిని ఎలా నింపాలో అవగాహన లేక సతమతమవుతున్నారు.
ఇక బీల్వోల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. బీఎల్వోలు ఏ ప్రాంతంలో పని చేస్తున్నారు.. ఇంటింటికీ వెళ్తున్నారా? లేదా? అనేది పరిశీలిచండం లేదని సమాచారం. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడి వివరాలు ఖచ్చితంగా న మోదు కావాల్సి ఉండ గా, బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లకుండా కేవలం ఫోన్ ద్వారానే సమాచారం సేకరిస్తే తప్పులు జరిగే అవకాశాలు ఎకువగా ఉంటాయి. ము ఖ్యంగా కొత్త ఓటర్లు, చిరునామా మారిన, మరణించిన వారి వివరాల ధ్రువీకరణలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
అంతేకాక టోల్ ఫ్రీ నంబర్ 1950కు ఫోన్ చేస్తే కనెక్ట్ కావడం లేదని, హెల్ప్‌డెస్క్‌లో సంప్రదిస్తే మీ ఏరియా బీఎల్వోలను కలవాలని ఉచిత సలహాలిస్తున్నారని ఓటర్లు వాపోతున్నారు. అలాగే ఒక కుటుంబంలో భార్యాభర్తలకు ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇచ్చి కుమారులు, కూతుర్లకు ఇవ్వకపోవడంతో లిస్టులో పేరు లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బీఎల్వోలు తప్పకుండా ఇంటింటికీ తిరిగేలా చర్యలు తీసుకోవాలని, సూపర్వైజర్లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేలా చూడాలని, అలాగే ఎన్యుమరేషన్ ఫామ్‌లు నింపడంపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటి వరకు మా ప్రాంతానికి ఒక్కసారి కూడా బీఎల్వోలు రాలేదు. టోల్ ఫ్రీ నంబర్ 1950కు ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదు. హెల్ప్ డెస్క్‌లో సంప్రదిస్తే మీ ఏరియా బీఎల్వోను కలవాలంటున్నరు. కనీసం ఫోన్ నంబర్ ఇవ్వమన్నా ఇవ్వడం లేదు. అసలు మా ప్రాంతానికి బీఎల్వో ఎవరో తెలియని పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువుంది. ఫామ్ ఇస్తే వెంటనే నింపి తిరిగి వారికిస్తాం. అధికారులు మా ప్రాంతానికి వెంటనే బీఎల్వోను పంపించి ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందజేయాలి.
-యాదగిరి, ఇంటి నంబర్ 1-1-1123/ఏ, సిద్ధార్థనగర్, కాజీపేట
హనుమకొండ జిల్లాలో మొత్తం 5,09,014 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 3,19,306 మంది మ్యాపింగ్ పూర్తయ్యింది. ఇంకా 1,19,758 మంది ఓటర్ల మ్యాపింగ్ జరగాల్సి ఉంది. అలాగే సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అందిన సమాచారం మేరకు 4,96,180 ఎన్యుమరేషన్ ఫామ్‌లు పంపిణీ చేశారు. అయితే మిగిలిన ఓటర్ల వివరాల సేకరణ వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం లక్ష్య సాధనపై ప్రభావం చూపుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.