ములుగు జిల్లాపై ప్రకృతి పగబట్టిందా? ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరదలు ముంచెత్తడం, ఆ తర్వాత సుడిగాలులతో తాడ్వాయి అటవీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించడం, తాజాగా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించడం వంటి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి? పచ్చని అడవులు, అపురూపు శిల్పసంపద నెలవైన రామప్ప ఆలయం, ఆసియా ఖండంలో ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర, ప్రకృతి రమణీయ లక్నవరం సరస్సు.. ఇలా ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రాంతాలున్న ములుగు జిల్లా సురక్షితమేనా? భవిష్యత్తులో మళ్లీ ఏదైనా ఉపద్రవం పొంచి ఉందా? వరుస ఘటనల ద్వారా ప్రకృతి ఇచ్చే సంకేతాలా? ఈ ప్రశ్నలన్నీ మొన్నటి భూకంపంతో జిల్లా ప్రజలను భయకంపితులను చేసింది. ప్రకృతితో చెలగాటమాడితే మూల్యం తప్పదని చెప్పకనే చెబుతోందని స్పష్టమవుతోంది. వరుస ఘటనలపై పూర్తిస్థాయి అధ్యయనం జరుగాల్సి ఉన్నప్పటికీ పర్యావరణ విధ్వంసం వల్లే విప్తతులకు కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రకృతి వనరులను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమనే విషయాన్ని అందరూ గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– ములుగు, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ)
గత మూడు నెలలుగా ప్రకృతి వైపరిత్యాలకు కేంద్ర బిందువుగా మారుతున్న మేడారం అడవులు భవిష్యత్తులో రానున్న విపత్తులకు సంకేతాలు ఇస్తున్నట్లుగా కనపడుతుంది. బుధవారం మేడారం అటవీ ప్రాంతం కేంద్రంగా భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించడంతో మేడారం ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. మేడారం పరిసర ప్రాంతాల చుట్టూ ఏం జరుగుతుందనే సందేహాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. 2023 జూలై 27వ తేదిన ఎన్నడూ లేని విధంగా ములుగు ప్రాంతంలో భారీ వర్షం కురిసి జంపన్నవాగుకు వరద పోటెత్తి మేడారం ప్రాంతమంతా ఎన్నడూ లేని విధంగా జలమయమైంది.
తొలి సారిగా జంపన్నవాగు నీళ్ళు తల్లుల గద్దెల వరకు చేరడంతో నాటి విపత్తును చూసిన స్థానికులు, భక్తులు భయాందోళనలు వ్యక్తం చేశారు. అదే సమయంలో మేడారంకు 10కిలో మీటర్ల దూరంలోని కొండాయి గ్రామం మొత్తం జంపన్నవాగు వరదకు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ సంఘటనలో కొండాయి గ్రామానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. ఆ ఘటనలు మరువక ముందే ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదిన తెల్లవారు జామున మేడారం అడవుల్లో వీచిన టోర్నోడో గాలులతో 500 ఎకరాల్లోని లక్షకు పైగా భారీ వృక్షాలు ఊహించని విధంగా నేలకు ఒరిగాయి.
చెట్లు నేలకు ఒరిగిన ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, అటవీ శాఖ అధికారులు సందర్శించి భారీ సుడిగాలి కారణంగా చెట్లు నేలకూలినట్లు ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు కాని ఆ ఘటనపై ఇప్పటికి శాస్త్రీయమైన, స్పష్టమైన నివేదికను అధికారులు కనుగొనలేకపోయారు. తాజాగా అదే ప్రాంతంలో మేడారం అడవుల కేంద్రంగా బుధవారం 5.3 తీవ్రతతో భూమి కంపించడం ములుగు ప్రాంత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ఏదేమైనా ప్రభుత్వం మేడారం అడవుల కేంద్రంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల మిస్టరీని కనుగొనేందుకు శాస్త్రీయపరంగా అధ్యాయనం చేయించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను, భయాన్ని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ములుగు ప్రాంతం బుధవారం సంభవించిన భూ ప్రకంపనలతో మరోసారి కొత్త చర్చకు తెరలేపినట్లయింది. మేడారం అటవీ ప్రాంతంలో మూడు నెలలుగా సంభవిస్తున్న వరుస సంఘటనలతో జిల్లా ప్రజలు తాము నివసిస్తున్న ప్రాంతాలు సురక్షితమైనవేనా అని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ బాధపడుతున్నారు.
సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా వినియోగించుకోవడంతో పర్యావరణ లోపం సంభవించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ములుగు జిల్లాలో కాకతీయుల కాలం నాటి రామప్ప, లక్నవరం, మల్లూరు వంటి పెద్ద జలాశయాలతో పాటు 800 చెరువులు, కుంటలు నిత్యం నీటితో నిండుగా ఉంటాయి. వీటితో పాటు జిల్లాలో పెద్ద పెద్ద వాగులు, వంకలు కూడా గోదావరి నది వైపు ప్రవహిస్తూ ఉంటాయి.
గోదావరి నది తీర ప్రాంతం, పక్క జిల్లాలోని సింగరేణి బొగ్గు తవ్వకాలు, ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఎర్రమట్టి క్వారీలు, గోదావరి నదితో పాటు వాగులు, వంకలలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్లే ఇలాంటి విపత్తులు హటాత్తుగా ములుగు ప్రాంతంలో ఉత్పన్నం అవుతున్నాయి. మేడారం అడవుల్లో జరుగుతున్న ఘటనలు భవిష్యత్తులో వచ్చే విపత్తులకు సంకేతాలా అనే అనుమానాలు బలపడుతున్నాయి. 55 ఏండ్ల క్రితం ములుగు ప్రాంతంలో భూకంపం సంభవించగా బుధవారం తిరిగి అదే రీతిలో భూకంపం సంభవించడం జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది.
జరుగుతున్న విపత్తులపై మనిషి గుర్తెరుగాలి. మనం చేసే తప్పులే విపత్తులకు కారణం. పర్యావరణపరంగా ప్రకృతిని కాపాడుకుంటూ అవసరం ఉన్న మేరకే వనరులను వినియోగించుకోవాలి. ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం, గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను ఈ మధ్యకాలంలో విపరీతంగా తోడటం వల్ల భూమిలో మొత్తదనం ఏర్పడుతుంది. సింగరేణి, ఇసుక తవ్వకాలు గోదావరి పరివాహక ప్రాంతాలలోని రెండు రాష్ర్టాలలో జరుగుతున్నాయి. దీని వలన భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది. భూపాలపల్లి, ములుగు అటవీ ప్రాంతంలో ఉపరితల, భూగర్భ బొగ్గు తవ్వకాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి.
ఇప్పటికే కాకతీయ గనులు, పెద్దాపూర్ ఎక్స్టెన్షన్, 5వ ఇక్లైన్, 8వ ఇక్లైన్ పూర్తయ్యాయి. వీటితో పాటు త్వరలో యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప గుడికి అతి దగ్గరలో నాలుగున్నర కిలో మీటర్ల దూరంలో పీ.వి. నర్సింహరావు పేరుతో ఓపెన్ కాస్ట్ గనులను వెంకటాపూర్ గ్రామ శివారులో ప్రారంభం అయ్యేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం అనుమతులు ఇచ్చి రామప్ప శివారులో గనుల తవ్వకాలు చేపట్టినట్లయితే రాబోయే రోజుల్లో జరిగే విధ్వంసం అంతా, ఇంతా కాదు. విచ్చలవిడిగా బొగ్గు తవ్వకాలతో పాటు ములుగు మండలంలోని మల్లంపల్లి ప్రాంతంలో మైనింగ్ చేపట్టి ఖనిజ లవణాలను తవ్వడం వల్ల జరిగే ఒత్తిడి వల్ల విడుదలయ్యే శక్తి కారణంగా భూగర్భ జలాల ప్రభావ దిశ మార్చుకోవడం వలన కూడా ప్రకృతి సమతుల్యత లోపిస్తుంది.
మైనింగ్ తవ్వకాలలో చాలా లోతుగా తవ్వి కావాల్సిన వాటిని తియ్యడం కోసం బ్లాస్టింగ్లు చేపట్టి పెద్ద పెద్ద మిషన్లను ఉపయోగించి తవ్వడం ద్వారా కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా దేశంలో హంటర్ వాలీ ప్రాంతంలో చేసిన బొగ్గు తవ్వకాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైలాడీలా ప్రాంతంలో ఐరన్ ఖనిజాల తవ్వకం, చైల్ ప్రాంతంలోని ఎస్కోన్దిడాలో కాపర్ కోసం తవ్విన మైన్ల వలన భూంకపాలు ఆయా ప్రాంతాల్లో వచ్చినట్లు రుజులున్నాయి. శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాలను ధృవీకరించి ఆయా ప్రాంతాలలో తవ్వకాలను చేపట్టవద్దని నివేదికలు సమర్పించారు. ప్రతీ రోజు ములుగు ప్రాంతం నుండి గోదావరి పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టి లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను తోడి నీటి ప్రవాహ దిశను మార్చడం, భూగర్భ జలాలను అడుగంటే విధంగా చేయడం వలన కూడా భూకంపాలు రావడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
– డాక్టర్ సుతారి సతీశ్, పర్యావరణవేత్త