పితృ అమావాస్య రోజు ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు గురువారం సద్దులతో ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎనిమిది రోజుల పాటు కొనసాగిన పూల జాతర గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపడంతో పరిసమాప్తమైంది. చివరి రోజు వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపడుచులు ఉదయమే తీరొక్క పూలను తీసుకొచ్చి చూడచక్కని బతుకమ్మలను పేర్చారు. అనంతరం పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.
సాయంత్రం కొత్త బట్టలు, బంగారు నగలు వేసుకొని అందంగా ముస్తాబై బతుకమ్మ ఆట స్థలాల వద్దకు చేరుకొని ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ‘పోయి రావమ్మా గౌరమ్మా.. వచ్చే యేడు మళ్లీ రావమ్మా‘ అంటూ చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయనం ఇచ్చిపుచ్చుకున్నారు. హనుమకొండలోని పద్మాక్షి గుండం వద్దకు వేలాదిగా మహిళలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆడపడుచుల బతుకమ్మ పాటలు, నృత్యాలతో హోరెత్తింది. పలుచోట్ల వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆడపడుచులు ఆటను కొనసాగించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -నమస్తే నెట్వర్క్
తొర్రూరు/బయ్యారం/కాశీబుగ్గ/ జనగామ రూరల్, అక్టోబర్ 10 : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల విద్యుత్ అంతరాయంతో మహిళలు చీకట్లోనే ఇబ్బందులు పడుతూ బతుకమ్మ ఆడారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెంకటాపురంలోని చెరువు వద్ద 2.15 గంటల పాటు విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. 11కేవీ ఫీడర్లో సాంకేతిక సమస్య తలెత్తిందని, సిబ్బంది తక్షణం స్పందించి మరమ్మతులు చేసినట్లు ట్రాన్స్కో డీఈ మధుసూదన్ తెలిపారు.
అలాగే బయ్యారం మం డల కేంద్రంతో పాటు కొత్తపేట గ్రామంలో పలుమార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మహిళలు అసహనానికి గురయ్యారు. రంగాపురం గ్రామంలో విద్యుత్ వైర్లు తెగి మంటలు రావడంతో మహిళలు మధ్యలోనే వెనుతిరిగారు. పలు చోట్ల పూర్తిస్థాయిలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో మసక వెలుతురులోనే బతుకమ్మ ఆడారు. ఘాట్ల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో నిమజ్జనం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. అలాగే గ్రేటర్ వరంగల్లోని 14వ డివిజన్ సుందరయ్యనగర్ 200 ఫీట్ల రోడ్డులో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ద్విచక్ర వాహనాల లైట్ల వెలుతురులోనే మహిళలు బతుకమ్మ ఆడారు. రాత్రి 8 గంటల తర్వాత విద్యుత్ రావడంతో మరికొద్దిసేపు ఆడుకొని ఇంటిదారి పట్టారు.
కరీమాబాద్, అక్టోబర్ 10: వరంగల్ నగరంలో సద్దు ల బతుకమ్మ ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారని వరంగ ల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. వరంగల్ 41వ డివిజన్ పరిధిలోని ఖిలావరంగల్ ప్రధాన ద్వారం వద్ద గురువారం రాత్రి జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నన్నపునేని మాట్లాడుతూ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో అట్టహాసంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై స్థానిక నాయకులు, అధికారులు చిత్తశుద్ధి చూపకపోవడం వల్ల మహిళలు ఇబ్బం ది పడ్డారన్నారు. కనీసం ఆట స్థలాలను శు భ్రం చేయకపోవడం, సరిగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.