ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన గ్రామసభలు రచ్చ రచ్చగా మారాయి. అధికారుల నిలదీతలు.. నిరసనల హోరుతో అట్టుడికాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ప్రజలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పథకాల జాబితాలో తమ పేర్లు లేవని, అనర్హులను ఎంపిక చేశారని గ్రామస్తులు మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, ధనవంతులు, మృతి చెందిన వారి పేర్లు వచ్చాయని నిలదీశారు. భూమి ఉన్న వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేర్లు ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి నచ్చిన వారి పేర్లను మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జాబితాలో చేర్చారని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అధికారులను ప్రజలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని సముదాయించారు. నామ్ కే వాస్త్‌గా కొనసాగిన సమావేశాల్లో అధికారులు ముందే నిర్ణయించిన పేర్లను చదివి వినిపించారు. ప్రజలు అడ్డుకోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించి తూ తూ మంత్రంగా ముగించి వెళ్లిపోయారు.
– నమస్తే నెట్వర్క్, జనవరి 21
ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామసభలో అధికారులపై కాంగ్రెస్ నాయకుడు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆయా పథకాల జాబితాలు చదవగా రెండేళ్ల క్రితం మృతిచెందిన పేర్లు, కోటీశ్వరుల పేర్లు ఉన్నాయని, ఇది పూర్తిగా పేదలకు అన్యాయం చేసేలా ఉందని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కూరెళ్లి సతీశ్ మండిపడ్డారు. ఇది కార్యదర్శి, స్పెష ల్ ఆఫీసర్, జీపీ సిబ్బంది తాగి ఇంట్లో పడుకొని రాసుకున్న లిస్ట్ అని, ఇంటింటికీ తిరిగి సర్వే చేయలేదని ఆరోపించారు. రీసర్వే చేసి అనర్హులను తొలగించి, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించాలని కోరారు. గ్రామానికి చెందిన చెరుకు సంజీవ, మంకు మటత్తమ్మల్ ఏడాదిన్నర క్రితం మృతిచెందగా, వారి పేర్లు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని సతీశ్ హెచ్చరించారు.
గీసుగొండ, జనవరి 21 : వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపురం గ్రామంలో అనర్హుడికి ‘ఆత్మీయ భరోసా’లో చోటుదక్కింది. మంగళవారం గ్రామంలో గ్రామసభ నిర్వహించగా, జాబితాలో వ్యవసాయ భూమి ఉన్న హర్షం మనోజ్ పేరు వచ్చింది. అధికారుల తీరుతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడంలో అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తున్నదని మండిపడ్డారు. కాగా, మనోజ్ గ్రామ సభకు వచ్చి తనకు భూమి ఉందని, ఆత్మీయ భరోసా వద్దని అధికారులకు లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు. దీంతో అధికారులు పేరు పరిశీలించి తొలగిస్తామని హామీ ఇచ్చారు.
ఇదివరకు ప్రజా పాలన గ్రామ సభలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్న. ఇత్తమని చెప్పిండ్రు కాని ఇయ్యలె. రేషన్ కార్డు లేక ఏడాది కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలకు దూరమైన. దేనికైనా రేషన్ కార్డే అడుగుతున్నరు. ఇప్పుడు మల్ల దరఖాస్తు పెట్టుకున్న. ఇగనైన ఇత్తరో.. ఇయ్యరో సూడాలె. అన్ని ఉన్నోళ్లకే రేషన్ కార్డులు ఇత్తున్నరు.. ఏమి లేనోనికి ఇయ్యడానికి చేతులత్తలేవా?
– గంట శరత్ చంద్ర, దుబ్బగూడెం, కాటారం
కూలి నాలి చేసుకునేదాన్ని. సొంతిల్లు లేదు. గతంలో కూడా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న. ఇప్పుడు మల్ల జేసుకున్న. ఇండ్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు ఇత్తున్నరు. ఏం లేని నాలాంటి పేద మహిళకు ఇత్తే ఆసరైతది గదా. ఇప్పుడన్న ఇందిరమ్మ ఇల్లు ఇత్తే మీ పేరు చెప్పుకుని బతుకుత.
– డోంగిరి అనసూర్య, కాటారం, జయశంకర్ భూపాలపల్లి