తొర్రూరు, మార్చి 12: యూరియా కోసం క్యూ చూశాం.. సినియా థియేటర్ల బారులు చూశాం.. కానీ, విచిత్రమేమిటంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కోసం లైన్లో నిలబడడం చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన గ్యాస్ కొరతతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. నాలుగు రోజులుగా సిలిండర్ల సరఫరా లేకపోవడంతో పట్టణంలోని తిరుమల భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు. గురువారం ఉదయం నుంచే సుమారు 500 మంది క్యూలో ఉండి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
గ్యాస్ బుక్ చేసుకున్నా తొర్రూరు మండల వ్యాప్తంగా వారం రోజులుగా సిలిండర్లు ఇంటికి డెలివరీ చేయకపోవడంతో వినియోగదారులు నేరుగా ఏజెన్సీ వద్దకు వస్తున్నారు. తిరుమల భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో తొర్రూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో కలిపి సుమారు 20 వేలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా ప్రతిరోజూ 300 నుంచి 600 వరకు ఆన్లైన్ బుకింగ్ నమోదవుతుంటాయి. బుకింగ్ చేసిన రెండు నుంచి మూడు రోజుల్లో సిలిండర్ డెలివరీ చేస్తారు. అయితే 10 రోజులుగా బుకింగ్ చేసినా సిలిండర్ డెలివరీ కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
ఇరాన్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోందని కొందరు పేరొంటుండగా, ఇదే అదనుగా చేసుకొని కొంతమంది గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లు బ్లాక్ మారెట్లో విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది మొబైల్ ఫోన్లకు సిలిండర్ డెలివరీ అయింది అనే మెసేజ్లు వస్తున్నాయని అంటున్నారు. ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత 25 రోజుల వరకు మరోసారి బుకింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ముందుగానే డెలివరీ అయినట్లు మెసేజ్ రావడం వినియోగదారుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నది. అధికారులు దృష్టి సారించి గ్యాస్ సరఫరాను సక్రమంగా చేయాలని కోరుతున్నారు.
వారం రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ల కొరతతో సరఫరాలో కొంత ఆలస్యం జరిగింది. ఆ కారణంగా బుకింగ్ చేసిన వినియోగదారుల ఇళ్లకు సకాలంలో డెలివరీ చేయడం కష్టంగా మారింది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంది. ఇప్పుడు ప్రతిరోజూ ఒక బండి చొప్పున గ్యాస్ సిలిండర్లు ఏజెన్సీకి వస్తున్నాయి. వాటిని వరుసగా వినియోగదారులకు అందజేస్తున్నాం. ఇకపై అలాంటి సమస్యలు ఉండవు.
– రవీందర్, అసిస్టెంట్ మేనేజర్, భారత్ గ్యాస్ ఏజెన్సీ
సిలిండర్ కోసం ఈనెల 4నబుకింగ్ చేసుకున్నాం. తొమ్మిది రోజులు గడిచినా ఇప్పటికీ డెలివరీ కాలేదు. గ్యాస్ గోదాం మా ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ ఇంత ఆలస్యమవడం బాధాకరం. ఇంట్లో పిల్లలు చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నారు. వారికి సమయానికి వంట చేయక ఇబ్బందులు పడతున్నారు. రోజూ గ్యాస్ వస్తుందేమో అని ఎదురుచూస్తున్నాం, కానీ, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. గ్యాస్ సరఫరాలో ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్నాం.
– ఎన్ వెంకటేశ్వర్లు, తొర్రూరు
నేను గ్యాస్ సిలిండర్ కోసం ముందుగానే బుకింగ్ చేసుకున్నాను. కానీ, సిలిండర్ ఇంటికి రాకముందే ‘డెలివరీ అయింది’ అని మెసేజ్ రావ డం ఆందోళన కలిగించింది. మా సి లిండర్ను ఎవరికైనా బ్లాక్లో అమ్ముతున్నారా? అని అనుమానం వస్తున్నది. వెంటనే సిలిండర్ తీసుకుని ఏజెన్సీ వద్దకు రాగా సుమారు 300 మంది ఇప్పటికే క్యూ ఉన్నారు. గ్యాస్ బుక్ చేసి పది రోజులు గడిచినా ఇప్పటివరకు సిలిండర్ ఇవ్వలేదు. వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం.
-గుగులోత్ యాకూబ్, హచ్చు తండా