సుబేదారి, నవంబర్ 16 : క్రీడాకారులకు క్రమశిక్షణ, నైపుణ్యం, సమయస్ఫూర్తి తప్పనిసరని క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రం జేఎన్ఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ క్రీడాకారులకు నిలయమని, ఇక్కడి నుంచి ఎంతో మంది రాష్ట్ర, దేశ, ప్రపంచస్థాయి క్రీడాపోటీల్లో రాణించారని అన్నారు. ఇటీవల దీప్తి జీవంజి పారా ఒలింపిక్స్‌లో రాణించిందన్నారు.
తాను కూడా రంజీ క్రికెట్ ఆడానని, 149 స్పీడ్‌తో బౌలింగ్ చేసినట్లు చెప్పారు. ఎన్నో కష్టాలు పడి రాణించానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ సాయికుమార్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ పారా ఒలిపింక్స్‌లో రాణించిన తన నియోజకవర్గానికి చెందిన దీప్తి జీవంజికి వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని తాను కుడా (కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ)ను కోరితే రిజెక్ట్ చేసిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి స్పందిస్తూ ఆ ముచ్చట ఇప్పుడెందుకని అడ్డుపడడంతో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది.