హనుమకొండ, మే 5 : బీఆర్ఎస్ ఆద్వర్యంలో బుధవారం నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఐదెకరాల స్థలంలో పెద్ద వేదికతో పాటు పది వేల మంది పాల్గొనేలా కుర్చీలు వేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేసవి నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకొనేలా జర్మనీ టెంట్లతో పాటు కూలర్లు సిద్ధం చేశారు. అలాగే వచ్చే రైతు ప్రతినిధులకు భోజన వసతి కల్పించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులు వచ్చేలా ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలు, బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం ఎలా ఉండేది, ప్రస్తుత ఎలా ఉందన్నది వివరించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో కేటీఆర్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు.