Swapnalok Fire Accident | ‘వారంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు. పొట్టచేతపట్టుకొని ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చారు. మరి కాసేపట్లో డ్యూటీ ముగించుకొని ఇండ్లకు వెళ్తామనుకుంటున్న సమయంలోనే అగ్నికీలలు చుట్టుముట్టాయి. దట్టమైన పొగ పూర్తిగా కమ్ముకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. కొండంత అండగా ఉంటారనుకున్న వారంతా.. అనంత లోకాలకు చేరడంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. గురువారం రాత్రి సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌లో జరిగిన అగ్ని ప్రమాదం.. ఆరు కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది.
స్వప్నలోక్ ఘటనలో మృతిచెందిన యువతీ యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో గాంధీ దవాఖానకు తీసుకువచ్చారు. ప్రమీల(22), వెన్నెల(20), త్రివేణి(22), శివ(22), శ్రావణి(22), ప్రశాంత్(22) మృతదేహాలు ఆసుపత్రికి చేరుకోగానే.. బాధిత కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. శుక్రవారం గాంధీ ఫోరెన్సిక్ విభాగం హెచ్‌వోడీ కృపాల్ సింగ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను ఆయా కుటుంబాలకు అప్పగించారు. ప్రభుత్వ అంబులెన్స్లలోనే మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు.
గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ‘మేం ఏం పాపం చేశాం దేవుడా..! మాకు ఇంత బాధను మిగిల్చావు’ అంటూ మృతదేహాలపై పడి బాధిత కుటుంబీకులు రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
Vennela
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మర్పల్లి గ్రామానికి చెందిన వెన్నెల(20) డిగ్రీ పూర్తిచేసింది. సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. వెన్నెల తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పార్ట్‌టైంగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఉద్యోగం కోసం రూ.1.40లక్షలు కావాలని చెబితే తల్లిదండ్రులు అప్పుచేసి కట్టారు. కూలీ పనులు చేస్తూనే రూ.40వేలు పెట్టి ల్యాప్‌టాప్ ఇప్పించారు. వారం రోజుల్లో తన క్లాస్మేట్ పెళ్లి ఉన్నది.. ఊరికి వస్తున్నట్లు గురువారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఇంతలోనే కూతురు మృత్యువాత పడిందని ఆమె తల్లిదండ్రులు గుండెలు బాధుకుంటూ బోరున విలపించారు. గ్రూప్స్ రాసి ఉద్యోగం తెచ్చుకున్నాక ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నింటినీ దూరం చేస్తానని వెన్నెల చెబుతుండేదని కన్నీటిపర్యాంతమయ్యారు.
Prashath
ఉన్నత ఆశయంతో నగరానికి వచ్చిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన ప్రశాంత్(24) జీవితం అర్థాంతరంగా ముగిసింది. ప్రశాంత్ తల్లిదండ్రులు జనార్దన్, ఉపేంద్రమ్మలది వ్యవసాయ కుటుంబం. ప్రశాంత్ డిగ్రీ వరకు చదివాడు. నాలుగు రోజుల కిందటే స్వగ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యాడు. అందరితో కలుపుగోలుగా మెలిగాడు. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తల్లి ఉపేంద్రమ్మకు ఫోన్ చేశాడు. డ్యూటీ ముగించుకొని హాస్టల్‌కు వెళ్లాక రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాప్ కాగా.. స్నేహితులు ప్రమాదం గురించి చెప్పారని ప్రశాంత్ తల్లిదండ్రులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు అర్థాంతరంగా తనువు చాలించాడని కన్నీరుమున్నీరయ్యారు.
Triveni
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రామారావు, వల్లమ్మలకు ఇద్దరు కూతుర్లు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి ఇద్దరు కూతుళ్లను డిగ్రీ వరకు చదివించారు. త్రివేణి(22) ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చి స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ కంపెనీలో ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నది. గురువారం తల్లి వల్లమ్మతో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ‘మీటింగ్‌లో ఉన్నా..మళ్లీ ఫోన్ చేస్తా’ అని చెప్పిందని, అవే త్రివేణి చివరి మాటలంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని త్రివేణి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Sravani
నర్సంపేట్ మండలం ఖానాపురం గ్రామానికి చెందిన పద్మ, నర్సింహ హోటల్లో లేబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ముగ్గురు సంతానంలో శ్రావణి(22) పెద్ద కూతురు. ఇంటర్ చదివిన శ్రావణి యేడాది కిందట హైదరాబాద్‌కు వచ్చింది. హాస్టల్లో ఉంటూ స్వప్నలోక్లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. తమలాగా తన కూతురు జీవితం ఉండకూడదని, అప్పుచేసి మరీ కూతుర్ని పట్నం పంపిస్తే.. ఇలా అవడంతో తట్టులేకపోతున్నామని పద్మ, నర్సింహ ఏడుస్తూ చెప్పారు.
Shiva
వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలం చంద్రయ్యపల్లికి చెందిన శివ(22) బీటెక్ చదివాడు. ఏడాదిన్నర కిందట ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికి ఫోన్‌చేసి కుటుంబ సభ్యులతో శివ మాట్లాడాడు. ఉగాది పండుగకు వస్తున్నానని చెప్పాడని, పండుగకు రాకుండానే కానరానిలోకాలకు వెళ్లాడంటూ శివ తల్లిదండ్రులు రాజు, రజిత గుండెలు బాధుకున్నారు.
Prameela
మహబూబాబాద్ జిల్లా సురేశ్నగర్లో నివాసముంటున్న బద్రు, బుజ్జీల కూమార్తె ప్రమీల(22). సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఆమె తల్లిదండ్రులు కూడా వ్యవసాయ కూలీలే. కూతురు ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న నేపథ్యంలో మృత్యువాత పడటంతో ఈ కుటుంబం ఛిద్రమైంది. ఇలా అవుతుందని అనుకోలేదని ప్రమీల తల్లిదండ్రులు విలపించారు.