e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home జనగాం తప్పని నిరీక్షణ

తప్పని నిరీక్షణ

  • బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ అలసత్వం
  • రోజుల తరబడి గిడ్డంగుల ఎదుటే లారీల బారులు
  • కాజీపేట ఎఫ్‌సీఐ గోదాముకు 1.10లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం
  • 40 ర్యాక్‌లు అవసరముంటే 15 మాత్రమే రాక
  • నెలాఖరుతో ముగియనున్న గడువు
  • మిల్లర్లలో ఆందోళన
  • ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు

హనుమకొండ, డిసెంబర్‌ 7 : బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ అలసత్వం వహిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సింది పోయి, నిల్వలు పేరుకుపోయాయని, స్థలం లేదని కుంటి సాకులు చెప్తుండడం విస్తుగొలుపుతున్నది. ఒక వేళ గోదాములు నిండితే అదనంగా గోదాములు తీసుకొని నిల్వ చేసుకోవాలి. ఇదంతా ఏమీ పట్టించుకోని ఎఫ్‌సీఐ, బియ్యం సేకరణలో కావాలనే జాప్యం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వీటన్నింటిని పట్టించుకోకపోవడంతోపాటు ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాలో గోదాముల వద్ద లారీలు రోజుల తరబడి నిరీక్షిస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని కాజీపేట ఎఫ్‌సీఐ గోదాముకు 1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నది. ఇక్కడికి హనుమకొండ జిల్లాతోపాటు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, జనగామ, వరంగల్‌ జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించి నిల్వ చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రైల్వే రాక్‌ల ద్వారా పంపిస్తారు. ఇందుకుగాను ప్రతి నెలా 40వరకు రాక్‌లు అవసరం పడుతాయి. కానీ, 15 మాత్రమే కేటాయిస్తున్నట్లు తెలిసింది. తద్వారా గోదాముల్లో నిల్వలు పేరుకుపోయి మిల్లుల నుంచి సీఎంఆర్‌ కోసం వచ్చే లారీలు అన్‌లోడ్‌ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. గడువు ఈ నెలాఖరు వరకే ఉండడంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. అసలు గడువులోపు బియ్యం చేరుతాయా? చేరవా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

15 వ్యాగన్లు మాత్రమే
కాజీపేట ఎఫ్‌సీఐ నుంచి బియ్యం ఇతర ప్రాంతాలకు తరలించేందుకుగాను ప్రతి నెలా 40 దాకా రైల్వే వ్యాగన్లు అవసరం ఉంటాయనేది సమాచారం. అయితే ఎఫ్‌సీఐ అధికారులు మాత్రం అరకొరగా 15వ్యాగన్లు మాత్రమే తెప్పించినట్లు తెలుస్తున్నది. ఎఫ్‌సీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటుగా రాక్‌లు తెప్పించుకోవాల్సి ఉండగా అలా ప్రయత్నం చేయడం లేదని మిల్లర్లు అంటున్నారు. నిల్వలు చేసుకునేందుకు జాగలు లేవనే చెబుతున్నారని, అలాంటప్పుడు ప్రైవేట్‌ గోదాంలు అద్దెకు తీసుకునే వీలున్నా ఎఫ్‌సీఐ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎఫ్‌సీఐ వ్యవహారంపై అటు మిల్లర్లు, ఇటు రైతులతో పాటు లారీ డ్రైవర్లు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎఫ్‌సీఐ అధికారులు వెంటవెంటనే బియ్యం అన్‌లోడ్‌ చేసుకునేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -

రోజుల తరబడి బారులు
స్థలం లేదనే కారణంతో ఎఫ్‌సీఐ ఎదుట బియ్యం లారీలు రోజుల తరబడి నిరీక్షిస్తున్నాయి. జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారు లు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లాలో 2020-21 యాసంగిలో రైతుల నుంచి కొనుగోలు చేసిన 2,27,633 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు 25 బాయిల్డ్‌ మిల్లులకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 67 శాతం చొప్పున మిల్లర్లు సీఎంఆర్‌ కింద ఎఫ్‌సీఐకి 1,54,709 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. దీని ప్రకారం ప్రణాళికలు రూపొందించాల్సిన ఎఫ్‌సీఐ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వ్యాగన్లు తెప్పించాల్సిన ఎఫ్‌సీఐ, నామమాత్రంగా వ్యవహరించడంతో సమస్య ఉత్పన్నమవుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థలం సమస్య ఉంటుందని అధికారులు అంటుండడంతో గోదాము ముందు బియ్యం లోడ్‌తో వచ్చిన లారీలు రోజుల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రింబవళ్లు లారీల డ్రైవర్లు కాపలాగా అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈక్రమంలో అక్కడే లారీలోనే భోజనాలు చేయడం, పండుకోవడం ఇబ్బందిగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు.

మూడు రోజులాయె..
రాంపూర్‌లోని రైస్‌ మిల్లు నుంచి బాయిల్డ్‌ రైస్‌ తీసుకొచ్చిన మూడు రోజుల నుంచి అన్‌లోడ్‌ కాక ఇక్కన్నే ఉంటున్న. నాకంటే ముందు వరుసలోని లారీలు పోతేనే నా వంతు వస్తది. రోజూ లారీలు వస్తున్నయ్‌. ఎఫ్‌సీఐ అధికారులు పట్టించుకుంటలేరు. రాక్‌లు రావడం లేదని, స్థలం లేదని చెప్తున్నరు. ఈన్నే తింటున్నం.. ఈన్నే పంటున్నం.
-ముచ్చు మైసయ్య, లారీ డ్రైవర్‌

జాగ లేదని తిరకాసు..
జాగ లేదనే కారణంతో లారీలో బియ్యం దిగుమతి రోజుల తరబడి ఆలస్యమవుతున్నది. ముందస్తు ప్రణాళికలు లేకుండా ఎఫ్‌సీఐ అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో మిల్లర్లకు, ప్రజలకు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వెంట వెంటనే బియ్యం దిగుమతి చేసుకొంటే మిల్లులో వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా 40 వ్యాగన్లు రావాల్సి ఉంటే కేవలం 15 నుంచి 20 వరకే వస్తున్నాయి. దీంతో జాగ సమస్య వస్తాంది.
-తోట సంపత్‌కుమార్‌,రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

రాక్‌లు వస్తలేవు
రాక్‌లు రాక లారీల నుంచి బియ్యం దింపుడు ఆలస్యమవుతాంది. నేను ఇక్కడ 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న. అప్పుడప్పుడు ఇలాంటి సమస్య వస్తది. నాలుగైదు రోజులు కూడా పట్టొచ్చు. ఎప్పటికప్పుడు రాక్‌లు వస్తే గోదాములు ఖాళీ అయి స్థలం ఉంటది. రెండు మూడు రోజలకు ఒక రాక్‌ వస్తాంది.
-యాద రాములు,ఎఫ్‌సీఐ హమాలీ

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement